Bye Election Result 2022: దేశంలోని 6 రాష్ట్రాల్లో పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (జూన్ 26) వెలువడనున్నాయి. జూన్ 23న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఫలితాలు కూడా ఆదివారమే వెలుడనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. త్రిపురలోని అగర్తల, శర్మ, జుబరాజ్‌గర్, బర్దోవాలా టౌన్ అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ జరిగింది. దీంతో పాటు జార్ఖండ్‌లోని మందర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్, ఢిల్లీ రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం ఆదివారం మధ్యాహ్నం నాటికి తేలనుంది.
రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల్లో పోటాపోటీ..
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో 48.58 శాతం, రాంపూర్‌లో 41.1 శాతం ఓటింగ్ నమోదైంది. అజంగఢ్‌లో ఎస్పీ అభ్యర్థి అసిమ్ రజా, బీజేపీ ఘన్‌శ్యాం లోధీ, రాంపూర్ స్థానంలో భోజ్‌పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ నిర్హువా బీజేపీ నుంచి ఎస్‌పి అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ మధ్య పోటీ నెలకొంది. ఎంపీలు అజాంఖాన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతర రాజీనామా చేయడంతో.. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అజంగఢ్, రాంపూర్ ఎస్పీకి కంచుకోటగా ఉన్నాయి. ఈ స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ సన్నాహాలు చేసి.. ఆ దిశగా ప్రచారం చేసింది.
సంగ్రూర్‌లో..
అదేవిధంగా పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో.. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ లోక్‌సభ స్థానంలో ఆప్, కాంగ్రెస్, బీజేపీ, ఎస్‌ఎడి పోటీపడుతున్నాయి.
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య పోటీ..
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేష్ పాఠక్, బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ లత మధ్య పోటీ నెలకొంది.
త్రిపురలో నాలుగు సీట్లు.. బరిలో ముఖ్యమంత్రి..
త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 76.62 శాతం ఓటింగ్ జరిగింది. జుబారాజ్‌నగర్, సూర్మా, అగర్తల, టౌన్ బార్దోవాలి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. బర్దోవాలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం మాణిక్ సాహా స్వయంగా బరిలోకి దిగారు.
ఆత్మకూరు సీటు ఎవరిది..
ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ నియజకవర్గంలో దాదాపు 65 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి సోదరుడు ఎం విక్రమ్ రెడ్డి బరిలో ఉండగా.. బిజెపి నుంచి భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
మందర్లో త్రిముఖ పోటీ
జార్ఖండ్‌లోని మందార్ స్థానంలో 61.25 శాతం ఓటింగ్ జరిగింది. ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. జేఎంఎం అభ్యర్థి శిల్పి నేహా కీర్తి, బీజేపీ గంగోత్రి కుజర్, స్వతంత్ర అభ్యర్థి దేవ్‌కుమార్ ధన్ మధ్య పోటీ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..