Budget 2024: వారికి రూ.15వేలు.. కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు పెద్దపీట.. మూడు ప్రోత్సహకాలు.. ఏంటంటే..

| Edited By: Venkata Chari

Jul 24, 2024 | 11:16 AM

కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత కేంద్రం. యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ , ఉపాధి కల్పన కోసం రూ. 2 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు లక్షా 52 వేల కోట్లను కేటాయించారు. ఓవైపు నిరుద్యోగం.. మరోవైపు వ్యవసాయరంగంపై ఫోకస్‌ ఎక్కువగా పెట్టారు.

Budget 2024: వారికి రూ.15వేలు.. కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు పెద్దపీట.. మూడు ప్రోత్సహకాలు.. ఏంటంటే..
Budget For Employment
Follow us on

నిరుద్యోగ నిర్మూలన , ఉపాధికల్పన , రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. యువతకు సంబంధించిన అనేక కీలకపథకాలను ప్రకటించారు. కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సహకాలు కల్పించారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం ఇస్తారు. మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లిస్తారు. నెలకు గరిష్ఠంగా రూ. లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 2 కోట్ల 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది. యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్‌ అని ప్రధాని మోదీ స్వయంగా తెలిపారు.

2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో..

2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ కల్పిస్తారు. 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు ఇస్తారు. ఉద్యోగ కల్పన కోసం మూడు కొత్త స్కీములను ప్రకటించారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు రూ. నెలవారీ భత్యం రూ. 5,000 ఇస్తారు.

‘‘ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి లక్షా 52 వేల కోట్లను కేటాయించాం. ఉపాధికల్పనకు ప్రోత్సాహకాలు ప్రకటించాం. ప్రధానమంత్రి ప్యాకేజ్‌ కింద మూడు కొత్త స్కీములను తీసుకొచ్చాం. ఈపీఎఫ్‌వోలో సభ్యుల చేరిక ఆధారంగా ఈ స్కీములను అమలు చేస్తాం. సంఘటిత రంగంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవాళ్లకు మూడు విడతల్లో నెల జీతం చెల్లిస్తాం.. నెలకు లక్ష జీతం ఉన్నవాళ్లకు ఇది వర్తిస్తుంది. ఉత్పత్తి రంగంలో ఉద్యోగాల్లో చేరే వాళ్లకు కూడా ప్రోత్సాహం కల్పిస్తాం.’’

– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగులకు , యాజమాన్యాలకు ప్రోత్సహకాలు ప్రకటించారు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. ఎక్కువమంది ఉద్యోగులకు చేర్చుకునే కంపెనీలకు రెండేళ్ల పాటు రూ. 3000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ను రీయెంబర్స్‌మెంట్‌ చేస్తారు. విద్య, నైపుణాభివృద్దికి లక్షా 48 వేల కోట్లను కేటాయించారు.

వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు.. లక్షా 52 వేల కోట్ల కేటాయింపు

వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రకటించారు. వ్యవసాయ , అనుబంధ పరిశ్రమలకు లక్షా 52 వేల కోట్లను కేటాయించారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళికను సిద్దం చేశారు.

ఐదు రాష్ట్రాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..