ఓ పెళ్లిలో వరుడు ధరించిన డ్రస్సు ఘర్షణకు దారి తీసింది. వధూవరుల బంధువులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ధార్ నగరానికి చెందిన యువకుడి వివాహాన్ని జరిపేందుకు బంధువులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 7న జరగాల్సిన పెళ్లి కోసం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగ్‌బీడా గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వరుడు షేర్వానీ ధరించి ఉన్నాడు. దాంతో వధువు తరపు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి సమయంలో వరుడు ధోతీ, కుర్తా ధరించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె బంధువుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. వధువు, వరుడి తరుఫు బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. వరుడి తరుఫు బంధువులు తమపై రాళ్లు రువ్వడంతో కొందరు గాయపడ్డారని వధువు తరుఫు మహిళలు ఆరోపించారు.
అయితే వధువు కుటుంబం నుంచి ఎలాంటి వివాదం లేదని, ఆమె తరుఫు బంధువులే తమ బంధువులపై దాడి చేశారని వరుడు ఆరోపించాడు. తాను షేర్వానీ ధరించడంపై పెళ్లి కుమార్తె బంధువులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో రాళ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పాడు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం యథాప్రకారం వధూవరుల వివాహం జరిగింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి