ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పందిళ్లపల్లి శ్రీనివాస్ అంటే బహుశా తెలుగు రాష్ట్రాల వారికి గుర్తుండదేమో కాని కర్ణాటక వాసులకు మాత్రం ఆయన ఒక చెరగని జ్ఞాపకం. ఎంతో ధైర్యశాలి, దానశీలి, మానవతావాది, పేదల పాలిట పెన్నిదిగా నిలిచిన శ్రీనివాస్.. 1991 నవంబర్ 10న కన్నుమూశారు. మరణించే నాటికి ఆయన వయస్సు 37 సంవత్సరాలు మాత్రమే.
కర్నాటక, తమిళనాడును గడగడలాడించిన గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మొట్టమొదటిసారి అరెస్టు చేసిన ఘనత శ్రీనివాస్ సొంతం. రాజమండ్రిలో 1954లో జన్మించిన శ్రీనివాస్.. 1979లో IFSకు ఎంపికయ్యారు. కర్నాటక కేడర్ రావడంతో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా ఆయనకు తొలి పోస్టింగ్ చామరాజనగర్‌లో వచ్చింది. వీరప్పన్ గురించి తెలుసుకునేందుకు ఆయనకు ఇది ఎంతో ఉపయోగపడింది. గ్రామస్తులతో సన్నిహితంగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవడంతో వారికి శ్రీనివాస్‌పై గురి కుదిరింది.
1986 నవంబర్ 16-17 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న సార్క్ సదస్సుపై దేశమంతా దృష్టి సారించిన వేళ గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను విజయవంతంగా పట్టుకున్నారు శ్రీనివాస్. వీరప్పన్‌ను విచారించి అతని స్థావరాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీనివాసన్ లేని సమయంలో వీరప్పన్ తప్పించుకున్నాడు. వీరప్పన్‌ను మళ్లీ బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ నవంబర్ 9, 1991న వీరప్పన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఒక వైర్‌లెస్ మెసేజ్ అందుకున్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ ఒంటరిగా వస్తే వీరప్పన్ లొంగిపోతాడన్నది ఆ మెసేజ్ సారాంశం.
మంచితనాన్ని నమ్మే వ్యక్తిగా వీరప్పన్‌ను పట్టుకునేందుకు శ్రీనివాస్ ఒంటరిగా వెళ్లారు. అడవిలో ఆరు కిలోమీటర్లున్న వాగు దాటి వీరప్పన్‌ను చేరుకునే సమయంలో అతని అనుచరుడు శ్రీనివాస్‌ను దారుణంగా కాల్చిచంపారు. జనాలను భయపెట్టేందుకు శ్రీనివాస్ తలను వేరుచేశాడు వీరప్పన్. తమను కంటిపాపలా చూసుకున్న శ్రీనివాస్ మరణాన్ని గోపినాథం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. కర్నాటక ఫారెస్ట్ అధికారులు ఆయనకు పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి నేటికి నివాళి ఘటిస్తూనే ఉన్నారు. ఆయన వాడిన జీపు కూడా అలాగే ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..