లక్నో, నవంబర్ 21: ఉత్తరప్రదేశ్‌లోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఓ గోనె సంచి అనుమానాస్పద స్థితిలో కనిపించింది. స్థానికులు దాన్ని తెరచి చూడగా దారుణ దృశ్యం కంటపడింది. అందులో ఓ దళిత యువతి మృతదేహం నగ్నంగా ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే అక్కడ స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో యువతిని హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో నవంబర్ 19న కర్హల్‌లో ఇద్దరు వ్యక్తులు 23 ఏళ్ల దళిత యువతిని కిడ్నాప్ చేశారు. బెక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు కొందరు చూశారు. అయితే బుధవారం కంజారా నది వంతెన వద్ద ఆ దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆమె హత్య వెనుక రాజకీయ నేపథ్యం ఉందని ఆమె కుటుంబం తెలిపింది. ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తానని తన అభిప్రాయం చెప్పడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ప్రశాంత్ యాదవ్ అనే యువుడు అభ్యంతరం తెలిపాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. యువతి బుధవారం రాత్రి కర్హల్ నుంచి కనిపించకుండా పోయిందని తెలిపారు. ఈ రోజు ఉదయం ఆమె మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. ఆమె తండ్రి ఇద్దరు వ్యక్తులపై కేసు పెట్టారు. ఒకరు ప్రశాంత్ యాదవ్. మరొకరు మోహన్ కతేరియా. ఇద్దరినీ అరెస్టు చేశామని కుమార్ చెప్పారు.
మెయిన్‌పురి జిల్లాలో ఉన్న కర్హాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీఅయ్యింది. ఆ స్థానానికి బుధవారం పోలింగ్ జరిగింది. 1993 నుంచి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న ఆ పార్టీ.. అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది. రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో అదే స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ మామ అనుజేష్ యాదవ్‌ను బీజేపీ నామినేట్ చేసింది. ఈ నియోజకవర్గంలో యాదవులు 1.4 లక్షల మంది ఉండగా, దళితులు, ముస్లింలు వరుసగా 40,000, 15,000 మంది ఓటర్లు ఉన్నారు.