BJP Strategy: బీజేపీ రెండో జాబితా కసరత్తు.. ఏపీలో ఎన్ని స్థానాల్లో పోటీ అంటే..?

| Edited By: Balaraju Goud

Mar 07, 2024 | 12:23 PM

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేయకముందే 195 పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ (BJP), తాజాగా రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ సహా సుమారు 12 రాష్ట్రాల నుంచి తొలి జాబితా సిద్ధం చేయగా.. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, తమిళనాడు, రాజస్థాన్‌లోని మిగిలిన స్థానాల కోసం అభ్యర్థులను సిద్ధం చేస్తోంది.

BJP Strategy: బీజేపీ రెండో జాబితా కసరత్తు.. ఏపీలో ఎన్ని స్థానాల్లో పోటీ అంటే..?
Amit Shah Jp Nadda
Follow us on

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేయకముందే 195 పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ (BJP), తాజాగా రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ సహా సుమారు 12 రాష్ట్రాల నుంచి తొలి జాబితా సిద్ధం చేయగా.. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, తమిళనాడు, రాజస్థాన్‌లోని మిగిలిన స్థానాల కోసం అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం బుధవారం అర్థరాత్రి దాటే వరకు జరిగిన సమావేశంలో సుమారు 150 స్థానాలపై చర్చించినట్టు తెలిసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కార్యదర్శి శివ్ ప్రకాశ్ పాల్గొన్న ఈ భేటీకి ఒకరి తర్వాత ఒకరుగా ఆయా రాష్ట్రాల కోర్ గ్రూపు నేతలు హాజరయ్యారు. మార్చి 8 లేదా 10న జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 2వ సమావేశానికి ముందుగా జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల వడపోత జరిగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మరింత వడపోసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అనంతరం 2వ జాబితా విడుదల చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా 300 స్థానాలకు పైగా అభ్యర్థులను ఖరారు చేయాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది.

ఆంధ్రాలో అన్ని స్థానాలపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం – జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు ఆ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు బుధవారం ఢిల్లీలో జరిగింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ ఢిల్లీ చేరుకుని పార్టీ పెద్దలతో రోజంతా మంతనాలు సాగించారు. రాత్రి అమిత్ షా బీజేపీ హెడ్‌క్వార్టర్స్ చేరుకున్న తర్వాత వివిధ రాష్ట్రాల కోర్ కమిటీ నేతలతో వరుసగా భేటీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చేసరికి రాత్రి గం. 10.40 కాగా.. పూర్తయ్యేసరికి 11.30 అయింది. భేటీ అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అసంపూర్తిగా ముగిసిందని, గురువారం కూడా మరోసారి జాతీయ నాయకత్వంతో సమావేశమవుతామని తెలిపారు.

ఈ భేటీలో పొత్తుల ప్రస్తావన రాలేదని వెల్లడించారు. ఏపీలో పరిస్థితులపై నివేదికతో పాటు, ఆశావహుల జాబితాను అధిష్టానానికి అందజేసినట్టు తెలిపారు. మొత్తంగా పొత్తులతో సంబంధం లేకుండా ఈ కసరత్తు కొనసాగుతోందని, పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని సోము వీర్రాజు వెల్లడించారు. గురువారం ఢిల్లీ పర్యటన చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ అనంతరం పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

లోక్‌సభ బరిలో పెద్దల సభ మంత్రులు

రెండో జాబితా కోసం జరిగిన కసరత్తులో భాగంగా రాజస్థాన్‌లో మిగిలిన 10 సీట్లపై చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నేతలతో పాటు పలువురు రాజ్యసభ సభ్యులను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా గతంలోనే ఆదేశించిన కమలదళం అధిపతులు ఆ దిశగా తొలి జాబితాలోనే కొంత కసరత్తు చేశారు. పెద్దల సభ ద్వారా మంత్రులైన పలువురిని తమ తమ రాష్ట్రాల్లో లోక్‌సభ బరిలోకి దించారు. రెండో జాబితాలోనూ ఈ విధానాన్ని కొనసాగించినట్టు తెలిసింది.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను మహారాష్ట్రలోని ఉత్తర ముంబై స్థానం నుంచి బరిలోకి దించనున్నట్టు సమాచారం. అలాగే ఒడిశాలోని సంభాల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌నుస, పూరీ నుంచి బీజేపీ జాతీయ నేత సంబిత్ పాత్రాను బరిలోకి దించేందుకు కసరత్తు జరుగుతోంది. తమిళనాడులో కన్యాకుమారి స్థానం నుంచి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌ను పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉంది. మరోవైపు కర్నాటకలో దాదాపు డజను సీట్లలో సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉంది. విద్వేష ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదూరి సహా పలువురు సిట్టింగ్ ఎంపీలను మార్చి వేరే నేతలకు టికెట్లు ఇచ్చినట్టుగానే, కర్ణాటకలో ఏకంగా దాదాపు సగం స్థానాలు మార్చనున్నట్టు తెలిసింది.

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో బీజేపీ 25 గెలుచుకోగా.. కాంగ్రెస్, జేడీ(ఎస్) చెరొక సీటు గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నటి సుమలత మండ్య స్థానం నుంచి గెలుపొంది, అనంతరం బీజేపీకి మద్ధతిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె నేరుగా బీజేపీ టికెట్ మీద బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో పొత్తుల్లో భాగంగా జేడీ(ఎస్)కు 3 సీట్లు ఇవ్వనున్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో బీజేపీ 33, శివసేన (షిండే వర్గం) 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిసింది. మిగతా 3 సీట్లలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) పోటీ చేసే అవకాశం ఉంది. ఒడిశాలోనూ 21 సీట్లకు బీజేపీ 14, బిజూ జనతా దళ్ (BJD) 7 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పొత్తులపై స్పష్టత వస్తే బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెలుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…