Presidential Election 2022: రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్న ఎన్డీఏ..? నేడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం..

|

Jun 21, 2022 | 5:50 AM

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Presidential Election 2022: రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్న ఎన్డీఏ..? నేడు బీజేపీ పార్లమెంటరీ సమావేశం..
Pm Modi
Follow us on

Presidential Election 2022 – NDA: రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల అయింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29న చివరి తేదీ. అయితే ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష కూటములు రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయలేదు. దీంతో అటు అధికార పక్షం, ఇటు విపక్షంలో ఉత్కంఠ నెలకొంది. కాగా.. దీనిపై మంగవారం రెండు పక్షాల నుంచి మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు (BJP parliamentary board) మంగళవారం సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు సోమవారం రాత్రి వెల్లడించాయి. ఈ భేటీలో ప్రధాని మోడీ కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రాష్ట్రపతి అభ్యర్తిపై ఉత్కంఠకు తెరదించే అవకాశముందని సమాచారం. నేడు యోగా దినోత్సవం (జూన్‌ 21) దృష్ట్యా మైసూర్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం ఆయన పార్లమెంటరీ బోర్డు భేటీలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం బీజేపీ కమిటీ కూడా వేసింది. జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో 14 మంది సభ్యులతో మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కో-కన్వీనర్‌లుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, సీటీ రవి ఉండగా.. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జి కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, భారతి పవార్, అర్జున్ మేఘవాల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, వనతి శ్రీనివాసన్, సంబిత్ పాత్ర, రాజ్‌దీప్ రాయ్ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఆదివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కమిటీతో సమావేశమయ్యారు.

ఇదిలాఉంటే.. ఈ రోజు సాయంత్రం విపక్ష నేతల భేటీ కూడా జరగనుంది. టీఎంసీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, లెఫ్ట్ సహా పలు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. జూన్ 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..