
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం, 1960లో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుదుర్చుకున్న సింధూ నది జల ఒప్పందాన్ని ప్రస్తావించారు. పహల్గాం ఘటనల నేపథ్యంలో, ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించే చర్చలు చోటుచేసుకుంటున్న తరుణంలో నడ్డా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “సింధూ ఒప్పందం ఆ కాలంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం. అయితే, నేటి పరిస్థితులలో దీన్ని తిరిగి సమీక్షించడం అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది,” అని నడ్డా ఎక్స్ వేదికగా తెలిపారు. “
’80 శాతం నీటిని పాకిస్తాన్‌కు నెహ్రూ అప్పగించారు..!’
ఈ ఒప్పందం కింద నెహ్రూ సింధూ నది నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీటిలో 80% పాకిస్తాన్‌కు అప్పగించి, భారత్ వాటాను కేవలం 20%కి పరిమితం చేశారని నడ్డా ఆరోపించారు. ఇది దేశ నీటి భద్రత, జాతీయ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే నిర్ణయమన్నారు. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత పార్లమెంట్‌ను సంప్రదించకపోవడం, రెండు నెలల తర్వాత కేవలం రెండు గంటల చర్చకు మాత్రమే ఉంచడం నెహ్రూ నియంతృత్వ వైఖరిని చూపిస్తుందని నడ్డా విమర్శించారు.
‘సహచరులు మాటలు కూడా నెహ్రూ వినలేదు’
నెహ్రూ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు నడ్డా పేర్కొన్నారు. అశోక మెహతా ఈ ఒప్పందాన్ని దేశానికి రెండో విభజనగా అభివర్ణించారని, విదేశీ మారక సంక్షోభంలో ఉన్నప్పుడు 83 కోట్లు పాకిస్తాన్‌కి చెల్లించడం నెహ్రూ చేసిన మహా తప్పిదం అని అప్పటి మరో కాంగ్రెస్ ఎంపీ అరుణ్ చంద్ర గుహ మండిపడ్డారని నడ్డా గుర్తుచేశారు.
‘వాజపేయి హెచ్చరించినా బేఖాతరు’
అప్పట్లో యువ ఎంపీగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ ఒప్పందంపై తీవ్రంగా స్పందించారని నడ్డా చెప్పారు. పాకిస్తాన్ అనవసర డిమాండ్లకు లొంగడం వల్ల స్నేహం ఏర్పడుతుందనుకోవడం తప్పు. అన్యాయం మీద నిజమైన స్నేహం నిలవదు” అని వాజపేయి నెహ్రూ నిర్ణయాన్ని విమర్శించినట్లు నడ్డా వివరించారు.
నెహ్రూ ‘హిమాలయన్ బ్లండర్’ చేస్తే – మోదీ ఆ తప్పు సరిచేశారు
ఈ మొత్తం వ్యవహారాన్ని నడ్డా “హిమాలయన్ బ్లండర్” అని పేర్కొన్నారు. “ఒక వ్యక్తి తప్పు ఆలోచనల కారణంగా దేశం నీటి భద్రత, జాతీయ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. కానీ ప్రధాని మోదీ ధైర్యవంతమైన నిర్ణయం వల్ల.. ‘నేషన్ ఫస్ట్’ అభిమతంతో ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేసి మరో పెద్ద చారిత్రక తప్పును సరిదిద్దారు” అని నడ్డా రాసుకొచ్చారు