Bird Flu: మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం..
కేరళలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపెట్టారు అక్కడి అధికారులు. కేరళలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో అప్రమత్తమైంది తమిళనాడు ప్రభుత్వం. కేరళ నుంచి వస్తున్న వాహనాలపై నిషేధం విధించింది.
Bird Flu Virus: కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కేరళలోని ఆళ్లపుల జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది. శాంపిల్స్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1) ఉందని నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లోని రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపెట్టారు. కేరళలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందడంతో అలెర్ట్ అయింది తమిళనాడు ప్రభుత్వం. కేరళ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచింది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు..
బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాపించకుండా కేరళ నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. సరిహద్దులోని చెక్‌పోస్ట్‌లలో వెటర్నరీ డాక్టర్‌తో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. తమిళనాడు రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని శానిటైజ్ చేసి అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం లేదని చెబుతున్నారు అధికారులు.
ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ప్రజలు సగం ఉడికించిన లేదా పచ్చి గుడ్లను తినకూడదని, పూర్తిగా ఉడికించిన గుడ్లు, చికెన్ మాత్రమే తినొచ్చని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..