Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్.. విచారణకు స్వీకరించిన ధర్మాసనం..
New Delhi: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష పెడుతూ జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు..
New Delhi: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష పెడుతూ జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, మరో పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ ముగ్గురి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, న్యాయవాది అపర్ణా భట్‌లు పిటిషన్లు దాఖలు చేయగా.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాగా, తాము రిమిషన్‌ను మాత్రమే సవాల్ చేస్తున్నామని, సుప్రీంకోర్టు ఆర్డర్‌ను కాదని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రిమిషన్ మంజూరు చేసిన విధానాలు సరిగా లేవని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రేపు తన తీర్పును వెలువరించనుంది.
కాగా, క్రూరమైన అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషులందరినీ విడుదల చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం నిందితులంతా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి విడుదలైన సందర్భంగా వీరందరికీ పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించి సత్కరించారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.
2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో సహా ఏడుగురిపై ఈ నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ బానో మూడేళ్ల కుమార్తె సలేహా సహా 14 మంది కుటుంబ సభ్యులను అత్యంత క్రూరంగా కాల్చి చంపేశారు. ఈ కేసును విచారించిన ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు 2008, జనవరి 21న 11 మంది నిందితులకు జీవత ఖైదు విధించింది. ఆ తరువాత వారు బాంబై హైకోర్టును ఆశ్రయించగా.. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అప్పటి నుంచి వీరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
అయితే, కోర్టు తీర్పుతో జీవిత ఖైదు పడి శిక్ష అనుభవిస్తున్న జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్, రమేష్ చందనా అనే 11 మంది ఖైదీలను తాజాగా గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులు 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు.. తనను ముందస్తుగా విడుదల చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతన అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది నిందితులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..