కాషాయ దళం కీలక నిర్ణయం.. కేంద్ర కేబినెట్‌తోపాటు పార్టీలో భారీ ప్రక్షాళన..!

బీహార్ ఫలితాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది ఎన్డీయే సర్కార్. రెండు అంశాలపై కీలకంగా దృష్టిపెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జాతీయ అధ్యక్షుడి ఎంపికని ఫైనల్‌ చేయటంతో పాటు.. కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది. అదే సమయంలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలపై వ్యూహాలకు పదునుపెట్టబోతోంది.

కాషాయ దళం కీలక నిర్ణయం.. కేంద్ర కేబినెట్‌తోపాటు పార్టీలో భారీ ప్రక్షాళన..!
Pm Modi, Amit Shah

Updated on: Nov 18, 2025 | 8:06 AM

బీహార్ ఫలితాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది ఎన్డీయే సర్కార్. రెండు అంశాలపై కీలకంగా దృష్టిపెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జాతీయ అధ్యక్షుడి ఎంపికని ఫైనల్‌ చేయటంతో పాటు.. కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది. అదే సమయంలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలపై వ్యూహాలకు పదునుపెట్టబోతోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డబుల్‌ సెంచరీ సీట్లతో మరోసారి అధికారంలోకొచ్చింది ఎన్డీయే సర్కారు. దీంతో వాట్‌నెక్ట్స్‌ అనేదానిపై ఫోకస్‌ పెట్టింది కేంద్ర నాయకత్వం. మరో రెండు వారాల్లో కేంద్రంలో కీలక పరిణామాలు ఉంటాయని సంకేతాలిచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీజేపీ రాష్ట్ర సారధుల నియమకాలు పూర్తయినా.. జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఇంకా తేలలేదు. అదే సమయంలో కేంద్ర కేబినెట్‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ అంశాలపైనే కసరత్తు మొదలుపెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం.

బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే.. ఈ రెండు ఆంశాలపైనే నిర్ణయం తీసుకోబోతోంది బీజేపీ నాయకత్వం. డిసెంబరు 1న శీతాకాల సమావేశాలకు ముందే కొత్త పరిణామాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిలో ముఖ్యమైంది బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక. ఐదేళ్లుగా సారధ్య బాధ్యతలు చూస్తున్న జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఫైనల్‌ చేయబోతోంది బీజేపీ హైకమాండ్‌. ఇదివరకే నాలుగైదుపేర్లు బలంగా వినిపించినా.. బీహార్ ఎన్నికలు ఉండటంతో దాన్ని హోల్డ్‌లో పెట్టింది. ఇప్పుడా నియామకానికి ముహూర్తం సమీపించినట్లే కనిపిస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో గతంలో అరడజను పేర్లు వినిపించినా ప్రధానంగా రేసులో ముగ్గురున్నారనే ప్రచారం బలంగా ఉంది. ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర నాయకత్వానికి సన్నిహితుడైన ధర్మేంద్ర ప్రధాన్ సంస్థాగతంగా కూడా పట్టున్న నాయకుడు. రేసులో మొదటి నుంచీ వినిపిస్తున్న మరోపేరు శివరాజ్ సింగ్ చౌహాన్. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేరును కూడా కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది. భూపేంద్ర యాదవ్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి.

బీజేపీ జాతీయ అధ్యక్ష నియామకం అనేక సమీకరణాలతో కూడుకుని ఉంటుంది. సంస్థాగత అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు కేంద్ర నాయకత్వంతో సాన్నిహిత్యం, అగ్ర నేతలకు నమ్మకస్తుడైన నాయకుడై ఉండాలి. ఇవన్నీ చూసే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోబోతోంది. బీజేపీ చీఫ్‌ ఎంపికతో పాటు కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావటంతో.. కేబినెట్‌లో కొన్ని కూడికలు, తీసివేతలు ఉండొచ్చని భావిస్తున్నారు.

కేంద్రమంత్రులుగా ఉన్న నలుగురు బీజేపీ చీఫ్‌ రేసులో ఉన్నారు. వారిలో ఒకరికి పార్టీ పగ్గాలిస్తే.. మరొకరికి మంత్రిగా అవకాశమిస్తూ కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ ఉంటుంది. ఇప్పటికే మంత్రుల పనితీరును ప్రధాని నిశితంగా చూస్తున్నారు. పర్‌ఫామెన్స్‌, ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరి స్థానంలో కొత్తవారిని తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేంద్రమంత్రులుగా ఉన్న అనుభవజ్ఞులైన నాయకులకు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, వాళ్ల స్థానంలో కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.

2026లో కీలకమైన తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందునుంచే వ్యూహాలను రూపొందించడంలో పార్టీ కొత్త చీఫ్ కీలకం కాబోతున్నారు. అందుకే అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండువారాల్లోనే కీలక నిర్ణయాలు ఉండొచ్చంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..