లాలూ ప్రచారం లేకుండానే బీహార్ ఎన్నికలు
జబ్‌తక్ సమోసామే రహేగ ఆలూ.. బీహార్‌మే రహేగా లాలూ... జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ.. కొన్నాళ్ల కిందట వరకు బీహార్‌లో ఈ స్లోగన్‌లు గట్టిగానే వినిపించాయి..
జబ్‌తక్ సమోసామే రహేగ ఆలూ.. బీహార్‌మే రహేగా లాలూ… జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ.. కొన్నాళ్ల కిందట వరకు బీహార్‌లో ఈ స్లోగన్‌లు గట్టిగానే వినిపించాయి.. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఇది నిజమే కాబోలని కూడా అనిపించింది.. ఇప్పుడు సమోసాలో ఆలూ ఉంది కానీ.. లాలూ ప్రసాద్ యాదవే లేరు.. బీహార్‌లోనే ఉన్నారు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. అసలు లాలూ లేని బీహార్ ఎన్నికలను ఊహించడం కష్టమే! లాలూ లేకుండా ఎన్నికలు జరగడం నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి.. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం అనారోగ్యం దృష్ట్యా ఆయన రాంచీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం ఇదే ప్రథమం.. అందుకే ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తన తండ్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సేవలను వినియోగించుకోలేకపోవడం పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేస్తున్నదని తేజస్వీ అన్నారు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఆర్‌జేడీకి అత్యంత అవసరమని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు గెలుపును అందుకునే వరకు అధిక సమయం కేటాయించాలని కోరారు. లాలూ ప్రచారంలో పాల్గొనకపోవడం ఆర్‌జేడీకే కాదు, బీహార్ ప్రజలకు కూడా నష్టమేనని తేజస్వీ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీహార్ ప్రజలు లాలూ ప్రసాద్‌యాదవ్‌పైనా, ఆర్‌జేడీపైనా ఎంతో నమ్మకం చూపించారని, ఈసారి కూడా అదే విశ్వాసాన్ని కనబర్చాలని అభ్యర్థించారు.. ఈసారి అధికారంలోకి వచ్చేది ఆర్‌జేడీనేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు తేజస్వీయాదవ్.