లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా దేశంలో అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇండియా పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ విపక్ష కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. అయితే ఇక్కడ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే ప్రధాన మంత్రి అభ్యర్థి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేని కొన్ని పార్టీలు ప్రతిపాధించినట్లు సమాచారం. దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా స్పందించారు. మల్లిఖార్జున ఖార్గేని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలాగే తనకు ప్రధాన మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తిలేనట్లు మొదట్లోనే తెలిపినట్లు స్పష్టం చేశారు. ఖర్గేని ప్రధాని పదవికి ఎంపిక చేస్తున్నారన్న విషయంలో తనకు ఎలాంటి కోపం లేదని మీడియాకు తెలిపారు. అయితే లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరగా సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
పాట్నాలో అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక్కటి చేయడమే తన లక్ష్యం అని తెలిపారు. ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ఉన్నాయన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. దివంగత నేత వాజ్ పేయీపై తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ మతం వారు కూడా అసౌకర్యాలకు గురికాలేదన్నారు. త్వరలోనే ఇండియా కూటమిలో సీట్ల సర్థుబాటు ప్రక్రియ పూర్తవుతుందని తన భావనను వ్యక్తం చేశారు. అలాగే తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని మరో సారి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..