Bengaluru Volunteers: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. దేశాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే తెలిసిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల్లో స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. కరోనా చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు కడసారి చూపు కూడా నోచుకోవడం లేదు. అంత్యక్రియలు నిర్వహించే ఆ నలుగురు మాత్రమే అక్కడ ఉండేది. బంధువులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. మరికొన్ని సంఘటనలను చూస్తుంటే దారుణంగా ఉన్నాయి. జేసీబీ వాహనాలను ఉపయోగించి మృతదేహాలను ఖననం చేస్తున్నారు. చనిపోయిన వారి పట్ల మానవత్వం లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. కోవిడ్‌తో మృతి చెందిన వారికి అంత్యక్రియల్లో ‘ఆ నలుగురు’ అనే వారే లేకుండా పోయారు.
ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన మేర్సి ఎంజిల్స్ ఎన్జీవో కరోనా మృతదేహాలకు ఆ నలుగురు అన్ని సాంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనాతో మృతి చెందిన అన్ని మతాల వారిని, వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్జీవోకు చెందిన అన్నే మోరిస్ గత ఏడాది సుమారు 120 మంది కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేశారు. ఈ సంవత్సరం సుమారు 600పైగా చేశానని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తితో మృత దేహాల సంఖ్య మర్చిపోయానని పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలో రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతుండగా, వందల్లో మరణాలు నమోదు అవుతున్నాయి.