గోవా నాలుగేళ్ల బాలుడి హత్య కేసులో కీలక విషయాలు.. తండ్రి వస్తున్నాడనే
గోవాలో కన్నతల్లి కర్కశత్వం.. భర్తపై కోపంతో కొడుకునే కడతేర్చిన తల్లి.. ఎస్.. గోవాలో దారుణానికి పాల్పడింది ఓ తల్లి. కుమారుడ్ని చూసేందుకు భర్త తరచూ వస్తున్నాడనే కారణంతో నాలుగేళ్ల కొడుకునే చంపేసింది ఆ తల్లి. కానీ.. అనుకోని పరిస్థితుల్లో చిన్న క్లూతో అడ్డంగా బుక్కయింది. ఏ హోటల్లో అయితే.. కుమారుడ్ని చంపేసిందో.. అదే హోటల్ ద్వారా బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవరే ఆమెను పోలీసులకు పట్టించాడు.
గోవాలో నాలుగేళ్ల కుమారుడిని చంపి, సూటుకేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనాసేత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడాకుల నేపథ్యంలో నాలుగేళ్ల కొడుకును తన భర్త వెంకటరామన్‌తో గడిపేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. సుచనసేత్- వెంకటరామన్ దంపతులకు నాలుగేళ్ల కొడుకు ఉండగా.. ఇరువురి మధ్య మనస్ఫర్థలతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కొనసాగుతుండగా.. కొడుకు.. ప్రతి ఆదివారం తండ్రి దగ్గరే ఉండేలా కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో.. తరచూ కొడుకు కోసం తండ్రి వస్తున్నాడని నిరాశ చెందిన సుచనాసేత్.. నాలుగేళ్ల కొడుకు చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఎలాగైనా కొడుకును హత్య చేయాలనే కౄరమైన ఆలోచనకు వచ్చిన సుచనాసేత్.. గోవాలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. జనవరి 6 నుంచి 10వరకు హోటల్ రూమ్ బుక్ చేసుకున్న సుచనాసేత్.. 8వ తేదీ అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు ఖాళీ చేసి వెళ్లారు. ఈ క్రమంలో.. ఆరో తేదీన తన నాలుగున్నరేళ్ల కుమారుడితో హోటల్‌కు వచ్చారు. కానీ.. 8వ తేదీ అర్థరాత్రి పన్నెండున్నర సమయంలో సడెన్‌గా హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధమై.. క్యాబ్ కావాలని హోటల్ సిబ్బందిని అడగ్గా ఏర్పాటు చేశారు. కానీ.. ఆమె క్యాబ్‌లో వెళ్లిపోయిన తర్వాత.. రూమ్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన హౌస్‌కీపింగ్ సిబ్బందికి కొద్దిపాటి రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రూమ్ అంతా చెక్ చేయగా.. రక్తపు మరకలతోపాటు రెండు ఖాళీ దగ్గు మందు సీసాలు కనిపించడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. అదేసమయంలో.. నాలుగేళ్ల బాబుతో వచ్చిన సుచనాసేత్.. ఆమె తిరిగి వెళ్లేటప్పుడు అతను కనిపించలేదని హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దాంతో.. పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. క్యాబ్ బుక్ చేసింది తామేనని హోటల్ సిబ్బంది చెప్పడంతో ఏదో జరిగిందని గుర్తించి.. క్యాబ్ డ్రైవర్‌ను ట్రాక్ చేయడంతో సుచనాసేత్ గుట్టురట్టు అయింది.
గోవా నుంచి బెంగళూరు వెళ్తుండగా.. క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసిన పోలీసులు.. సుచనాసేత్‌కు ఇవ్వాలని చెప్పి.. ఆమె కొడుకు గురించి ఆరా తీశారు. దాంతో.. గోవా మార్గోవ్‌లోని తన ఫ్రెండ్స్‌తో ఉన్నాడని చెప్పగా.. సమీపంలోని పోలీసులతో ఆ అడ్రస్‌ను వెరిఫై చేయిస్తే నకిలీదని తేలింది. వెంటనే.. క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసిన పోలీసులు.. సుచనాసేత్ చెప్పిన వివరాలన్నీ తప్పుగా ఉన్నాయని.. ఆమెను దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ఆదేశించారు. అంతే.. క్యాబ్ డ్రైవర్.. చాకచక్యంగా వ్యవహరించి సమీపంలోని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. దాంతో.. సుచనాసేత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఆమె లగేజ్ చెక్ చేయగా.. సూట్‌కేసులో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఇక.. సుచనాసేత్‌ను పూర్తిస్థాయిలో విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. అదేసమయంలో.. ట్రాఫిక్ జామ్ తమకు కలిసొచ్చిందని.. లేకుంటే ఆమెను అరెస్టు చేయడం కష్టమయ్యేదని తెలిపారు పోలీసులు. కుమారుడి మృతదేహాన్ని తీసుకుని ఆమె పారిపోతున్నప్పుడు.. గోవా సరిహద్దుల్లోని క్లోరా ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందన్నారు. అక్కడ సుచనాసేత్ నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని… ఆమెను వేగంగా చేరుకునేందుకు ట్రాఫిక్ జామ్ ఉపయోగపడిందన్నారు. మొత్తంగా.. నాలుగేళ్ల కొడుకు హత్య కేసుకు సంబంధించి నిందితురాలు సుచనాసేత్‌ను పట్టించడంలో క్యాబ్ డ్రైవర్ కీలకంగా వ్యవహరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.