బెంగళూరులో ఏడేళ్లుగా దేవాలయాల నుంచే కాదు వివిధ రకాల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల నుంచి బ్రాండెడ్ షూలను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విద్యారణ్యపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 10 వేలకు పైగా బ్రాండెడ్ బూట్లను దుండగులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఇంటికి చేరుకున్న పోలీసులు 715 జతల బ్రాండెడ్ బూట్లు గుర్తించారు. అక్కడ ఉన్న రూ.10 లక్షల విలువైన బూట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బీఈఎల్ లేఅవుట్‌లోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై పోలీసులు విచారిస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు బూట్ల చోరీ కేసులో నిందితులైన గంగాధర్, ఎల్లప్ప అనే ఇద్దరు వ్యక్తులు ఏడేళ్ళ నుంచి ఇళ్లతోపాటు పలు ప్రాంతాల్లో దోపిడీలను చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులైన గంగాధర్, ఎల్లప్ప డబ్బులు సులభంగా సంపాదించడానికి ఒక పద్ధతిని కనిపెట్టారు. రాత్రి సమయంలో ఆటోరిక్షాలో తిరుగుతూ అపార్ట్‌మెంట్లు, దేవాలయాలను టార్గెట్ చేసుకున్నారు. ఖరీదైన బూట్లను గుర్తించిన వాటిని దొంగిలించేవారు. ఆ తర్వాత ఆ షూస్‌ని కొత్తగా కనిపించేలా శుభ్రంచేసేవారు. తర్వాత వాటిని ఊటీ, పుదుచ్చేరి తదితర పర్యాటక కేంద్రాల్లో తక్కువ ధరకు విక్రయించేవారు. మొత్తం మీద వీరిద్దరూ గత ఏడేళ్లలో 10,000 కంటే ఎక్కువ బూట్లు దొంగిలించినట్లు చెప్పారు. చోరీకి గురైన కొన్ని వస్తువులను సండే మార్కెట్‌కు సరఫరా చేసి లాభం పొందేవారు అని చెప్పారు.
గత వారం విద్యారణ్యపురంలోని బీఈఎల్ లేఅవుట్‌లోని ఇంట్లో నిందితులు రెండు గ్యాస్ సిలిండర్లు, కొన్ని జతల షూలను అపహరించారు. దీంతో ఇంటి యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. దొంగలు చోరీ చేసిన ఇంటి వద్దకు వెళ్లేందుకు ఉపయోగించిన ఆటో రిక్షా వివరాలు లభించాయి. దీంతో పోలీసులు నిందితుల ఆచూకీని కనిపెట్టి గంగాధర్, ఎల్లప్పగా గుర్తించారు. బుధవారం అరెస్టు చేశారు.
నిందితుల ఇంట్లో దోపిడి వస్తువులను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ ఇంటి నుంచి 715 జతల బ్రాండెడ్ షూలు ఉన్నట్లు కనుగొన్నారు. రికవరీ చేసిన మొత్తం విలువ రూ. 10 లక్షలు ($11953)గా అంచనా వేశారు. ఇందులో బూట్లుతో పాటు మరికొన్ని వస్తువులు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..