Bengaluru Rains: ఎక్కడ చూసినా నీళ్లే.. ఎటు వెళ్లినా వరదలే.. బెంగళూరును ముంచెత్తుతున్న వర్షాలు..

|

Sep 05, 2022 | 1:36 PM

ఐటీ నగరి బెంగళూరును (Bengaluru) భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం తెల్లవారుజాము నుంచే కురుస్తున్న వానలకు...

Bengaluru Rains: ఎక్కడ చూసినా నీళ్లే.. ఎటు వెళ్లినా వరదలే.. బెంగళూరును ముంచెత్తుతున్న వర్షాలు..
Rains In Bangaluru
Follow us on

ఐటీ నగరి బెంగళూరును (Bengaluru) భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం తెల్లవారుజాము నుంచే కురుస్తున్న వానలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమయానికి ఆఫీస్ కు చేరుకోలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు నగరంలోని బెళ్లందురు, ఔటర్ రింగ్ రోడ్, BEML లేఅవుట్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రహదారి నీట మునిగింది. మార్తహళ్లి నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ రోడ్‌లోని ఎకో స్పేస్ ఏరియాలో రోడ్లపై నీరు (Rains) చేరింది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మారతహళ్లి-సిల్క్‌బోర్డ్‌ జంక్షన్‌ రోడ్డు సమీపంలో వరద నీటిలో ఓ వ్యక్తి నీట మునిగిపోయాడు. స్థానిక సెక్యూరిటీ గార్డులు అతనిని రక్షించారు. భారీ వర్షాల కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక అలర్ట్ అయింది. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 1533 కు కాల్ చేయాలని సూచించింది. 24×7 హెల్ప్‌లైన్ (2266 0000), వాట్సాప్ హెల్ప్‌లైన్ (94806 85700) కూడా అందుబాటులో తీసుకువచ్చింది.

మరోవైపు.. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు ఈ పరిస్థితులే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9 వరకప ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రం లోపలికి వెళ్లకూడదని సూచించారు. శివమొగ్గ, ఉడుపి, కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. బెంగళూరు నగరంలోనూ ఈ నెల 9 వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బెంగళూరులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వాటిని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరద పరిస్థితులపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక వ్యాప్తంగా సెప్టెంబర్ 9 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..