ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..?
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నకిలీ బంగారం అమ్ముతూ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటుకలు, చెక్క ముక్కలకు బంగారం పూత పూసి అమ్మే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి 970 గ్రాముల నకిలీ బంగారం, వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి చాలా మంది బాధితులున్నారని అనుమానం వ్యక్తమవుతోంది.

బంగారం.. పేరు వింటేనే మహిళల కళ్లలో మెరుపులు మెరుస్తాయి. ప్రస్తుతం ఉన్న ధర చూసి భయపడుతున్నారు కానీ, తక్కువ రేటుకు వస్తుందంటే.. అప్పు చేసి అయినా కొనేస్తారు. ప్రజల్లో ఉండే ఈ ఆశనే కొంతమంది క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఇటుకలు, చెక్కముక్కలను బంగారంగా మార్చి అమ్మే ప్రయత్నం చేశారు. కానీ, అసలు విషయం కనిపెట్టిన పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రబీకుల్ ఇస్లాం, అలీ, అన్వర్ హుస్సేన్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగళూరులోని కోరమంగళలో ప్రాంతంలో సంచరిస్తూ.. తమ వద్ద బంగారం ఉందని, ఇంటి పునాది వేస్తున్నప్పుడు బంగారు నిధి దొరికిందని ఒక కథను అల్లారు. అలాగే. మార్కెట్లో బంగారం ధరలో సగం ధరకే బంగారం ఇస్తామని అన్నారు. దీంతో వారి నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించారు. అయితే నిందితులు చెక్క పలకలు, ఇటుకలకు గోల్డ్ కోటింగ్ చేసి ఈ మోసానికి తెరలేపారు.
నిందితులు మొదట్లో రెండు గ్రాముల నిజమైన బంగారాన్ని ఇచ్చారు, తాము ఇస్తున్నది నిజమైన బంగారమే అని ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత నకిలీ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. బంగారాన్ని తీసుకోవడానికి వారు పేర్కొన్న ప్రదేశానికి రమ్మని ప్రజలకు చెప్పేవారు. దీని గురించి సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారిని కోరమంగళలో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తుల నుండి 970 గ్రాముల నకిలీ బంగారం, ఒక వాహనం, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..