ఢిల్లీ, జనవరి 14: కన్న కొడుకును అత్యంత దారుణంగా చంపిన బెంగళూరు సీఈవో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాలుగేళ్ల కొడుకుకి దగ్గు సిరప్ డోస్‌కు మించి తాగించి, ఆపస్మారకంలోకి వెళ్లిన చిన్నారి ముఖంపై దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం బాలుడి మృతదేహాన్ని మాయం చేయడానికి యత్నించి పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో బిడ్డను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్‌ను ఆమె మాజీ భర్త రామన్ శనివారం కలిశారు. విడాకులు, గృహహింస కేసుల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఈ జంట 15 నిమిషాల పాటు గోవా పోలీస్ స్టేషన్‌లో ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో దంపతులిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వెంకట్ తనపై శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సుచనా సేథ్ గృహహింస కేసు కూడా పెట్టింది. గతంలో కోర్టు ముందు వచ్చిన ఈ ఆరోపణలను వెంకట్ ఖండించాడు.
గోవాలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హత్య జరిగినప్పుడు ఆమె మాజీ భర్త వెంకట్ విదేశాల్లో ఉన్నాడు. తాను బాలుడిని కలవకుండా ఉండేందుకే సుచనా కొడుకును చంపి ఉంటుందని వెంకట్ చెబుతున్నాడు. జనవరి 7న బాలుడిని కలవాలని తాను సుచనాను కోరానని, ఆ మేరకు అతను సూచించని ప్రదేశానికి వెళ్లానని చెప్పాడు. అయితే అక్కడ ఎంతకూ బాలుడు గానీ, సుచన గానీ రాలేదన్నాడు. ఆ తర్వాత ఆమెకు మెసేజ్‌లు, ఇమెయిల్‌లు కూడా పంపించానని, కానీ ఆమె స్పందించలేదని వెంకట్ అధికారులకు చెప్పాడు.
కాగా దాదాపు విడాకులు ఖాయమైనప్పటికీ తండ్రి వెంకట్ కొడుకును కలవడానికి వీల్లేదని కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. గతేడాది ఆగస్టు 18న కోర్టు విధించిన ఆంక్షల ప్రకారం వెంకట్.. తన మాజీ భార్య ఉండే ఇంటిలోకి ప్రవేశించడం గానీ, ఫోన్ ద్వారా కొడుకుతో మాట్లాడటం గానీ చేయకూడదని పేర్కొంది. అయితే వారానికి ఒకసారి కొడుకును కలిసేందుకు తండ్రి వెంకట్‌కు కోర్టు అనుమతించింది. ఇది సుచనాను తీవ్ర ఘర్షణకు గురిచేసింది. కోర్టు అనుమతి దొరికినప్పటికీ సుచనా తన కొడుకును భర్త కలిసేందుకు అంగీకరించలేదు. వెంకట్ చివరిగా తన కొడుకును గతేడాది డిసెంబర్ 10న కలిశాడు. కొడుకు మృతి గురించి అధికారులు వెంకట్‌కు తెలియజేయగా.. తనకు ఆ విషయం తెలియని చెప్పాడు. బాలుడిని ఎందుకు చంపావంటూ వెంకట్ ప్రశ్నించగా.. గోవా సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో పిల్లవాడు బతికే ఉన్నాడని.. ఆమె నిద్రపోయి మేల్కొన్నప్పుడు బాలుడు చనిపోయి కనిపించాడని తెల్పింది. కాగా సుచనా పోలీసులకు కూడా బాలుడి మృతికి ఇదే కథ చెప్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.