ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు విధిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరు తాము బయలుదేరడానికి 72 గంటలలోగా ఇవి జారీ అయి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. తమ నిర్ణయాన్ని ప్రభుత్వం పౌర విమాన యాన మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ నెల 26 వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను సమర్పించాలని ఇదివరకే బెంగాల్ అధికారులు ఆదేశించారు. రాష్టంలో కరోనా వైరస్ కేసులపై మానిటర్ చేసేందుకు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యాన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. బెంగాల్ లో నిన్న ఒక్కరోజే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 56 మంది రోగులు మృతి చెందారు. కోల్ కతా, ఉత్తర 24 పరగణా జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 18 వేల యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు దశల్లో జరగాల్సి ఉన్నాయి. ఈ నెల 26, 29 తేదీల్లో పోలింగ్ జరగాల్సి వుంది. అయితే కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా భారీ ర్యాలీలను ఈసీ రద్దు చేసింది. పాదయాత్రలు, బైక్ ర్యాలీలను నిషేధించింది. అటు కోల్ కతా లో తాను ప్రచారం చేయబోనని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంతకు ముందే తన ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ చికిత్సలో ఆస్తమా మెడిసిన్, మహారాష్ట్ర టాస్క్ ఫోర్స్ నిపుణుల యోచన