‘మీరు ఘర్షణకారులు, ట్రంప్ కన్నా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటారు’ ప్రధాని మోదీపై మమత నిప్పులు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుక పడ్డారు. ఆయనను ఈ దేశంలోనే అతి పెద్ద ఘర్షణకారునిగా, డెమన్ గా అభివర్ణించారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుక పడ్డారు. ఆయనను ఈ దేశంలోనే అతి పెద్ద ఘర్షణకారునిగా, డెమన్ గా అభివర్ణించారు. అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురైన పరిస్థితి వంటిదే మీకోసం ఎదురుచూస్తోంది అని అన్నారు. ఆయన మాదిరే మీకూ ఓటమి తప్పదన్న తీరులో చెలరేగిపోయారు. హుగ్లీలో బుధవారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ ఆమె.. తమ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లోతానే గోల్ కీపర్ నని, బీజేపీకి సింగిల్ గోల్ కూడా రాదని అన్నారు. బొగ్గు చోరీ కేసులో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేయడాన్నిఆమె తప్పు పట్టారు. మా మహిళలను బొగ్గు దొంగలంటారా అని మమత దుయ్యబట్టారు. నన్ను చంపండి, కొట్టండి…కానీ ఒక మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారా ? మా కోడలికి బొగ్గు చోరీ కేసుతో సంబంధం ఉందని అభాండాలు వేస్తారా ? అని ఆమె ప్రశ్నించారు.
మా తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలని అనడానికి మీకు నోరెలా వచ్చిందని, మీకసలు చరిత్ర అంటూ లేదని, మాకు అన్నీ తెలుసు గానీ మీలాగా నోటిని పారేసుకోబోమని ఆమె అన్నారు. ఈ బీజేపీ నేతలు మన వెన్ను వంచడానికి ప్రయత్నిస్తున్నారని, వీళ్ళు మన రాష్ట్రంలోకి చొచ్చుకు వఛ్చి దీన్ని లాక్కోజూస్తున్నారని ఆమె ఆరోపించారు. గుజరాత్ ఈ రాష్ట్రాన్ని పాలించజాలదు అని ఆమె గర్జించారు.
Also Read: