ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు.. బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌కు మరణశిక్ష

|

Mar 15, 2021 | 6:54 PM

Batla House Encounter: దేశ రాజ‌ధాని ఢిల్లీలో 2008లో జ‌రిగిన బాట్లా హౌజ్ ఎన్‌కౌంట‌ర్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్‌కు సోమవారం ఢిల్లీ న్యాయస్థానం మరణశిక్ష..

ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు.. బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌కు మరణశిక్ష
Batla House Encounter
Follow us on

Batla House Encounter: దేశ రాజ‌ధాని ఢిల్లీలో 2008లో జ‌రిగిన బాట్లా హౌజ్ ఎన్‌కౌంట‌ర్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్‌కు సోమవారం ఢిల్లీ న్యాయస్థానం మరణశిక్షను ఖ‌రారు చేసింది. ఈ బాట్లా హౌజ్ కేసు.. అత్యంత అరుదైనదని ఢిల్లీ కోర్టు తీర్పులో వెల్లడించింది. బాట్లా హౌజ్ ఎన్‌కౌంట‌ర్ స‌మ‌యంలో ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్‌ శ‌ర్మ మ‌ర‌ణానికి కారణ‌మైన కేసులో ఇండియ‌న్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్‌ను ఇటీవ‌ల ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన ఆధారాలను బట్టి ఆరిజ్‌ ఖాన్‌ అతని సహచరులు జరిపిన కాల్పుల కారణంగానే ఇన్‌స్పెక్టర్‌ మోహన్ చంద్ శర్మ మృతి చెందినట్టు భావిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సందీప్‌ యాదవ్‌ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.

వరుస పేలుళ్ల సూత్రధారి..
ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఒకడు. 2008 సెప్టెంబర్‌ 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికీ చాలా కుటుంబాలు ఆసరాను కోల్పోయి జీవనం సాగిస్తున్నాయి.. అనంతరం 19న ఢిల్లీలోని జామియా నగర్‌లో బాట్ల హౌజ్‌‌ ఎల్‌-18 వద్ద ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌, అతడి నలుగురు అనుచరులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల కాల్పుల్లో.. ఉగ్రవాదులు అతిఫ్ అమీన్‌తోపాటు మహ్మద్ సైఫ్, సాజిద్ మరణించారు. అయితే అరిజ్ ఖాన్‌, షాజాద్ అహ్మద్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇన్‌స్పెక్టర్‌ మోహన్ చంద్ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. ఈ కేసులో షాజాద్ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. 2013లో కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించి.. జీవిత ఖైదు విధించింది.

అయితే అరిజ్ ఖాన్‌ మాత్రం పదేండ్ల పాటు పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. యూపీ అజమ్‌గఢ్‌కు చెందిన అతను వృత్తిరీత్యా ఇంజనీర్. ఇండియన్‌ ముజాహిదీన్‌ కేడర్‌ను బలోపేతం చేయడం, కొత్తవారిని నియమించుకోవడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. అరిజ్‌ ఖాన్‌పై పలు కేసులు నమోదు చేసిన ఎన్‌ఐఏ వేగంగా దర్యాప్తు చేపట్టింది. అరిజ్‌ ఖాన్‌ను 2018 ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: