కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై నియమితులయ్యారు. అనేక ఊహాగానాల మధ్య ఆయనకే సీఎం పీఠం దక్కింది. ఈ ఉదయం 11 గంటలకు(బుధవారం) ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనపై నమ్మకం ఉంచి.. బాధ్యతలు అప్పగించిన పార్టీకి బసవరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. తనకి ఈ పదవి వస్తుందని ఊహించలేదన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోయినప్పటికీ.. యడియూరప్ప తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను సూచించిన వ్యక్తికే సీఎం పీఠం దక్కేలా లైన్ క్లియర్ చేసుకున్నారు. యడియూరప్పకు నమ్మకస్తుడిగా బొమ్మైకి గుర్తింపు ఉంది.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బీజేపీ శాసనసభాపక్షంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. బొమ్మైని సీఎంగా ప్రకటించగానే.. అందరు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఆయనను శాసనసభపక్ష నేతగా బీజేపీ ప్రకటించింది.
జనతాదళ్ పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1998, 2004 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చిన కొన్ని రాజకీయ మార్పుల కారణంగా.. 2008లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో కీలకంగా వ్యవహరించారు బసవరాజు బొమ్మై.
షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. వ్యాపారవేత్తగా బొమ్మైకి మంచి పేరుంది. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారాయన.
మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై.. కుమారుడే ఈ బసవరాజ్. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై… యడియూరప్ప కేబినెట్‌లో హోం మంత్రిగా పనిచేశారు. తన వారసుడిగా బొమ్మైని సీఎం చేయాలని.. యడియూరప్ప సూచించారు.
కర్నాటక సీఎం బరిలో మొత్తం 10 మంది పేర్లు వినిపించాయి. అయినప్పటికీ బొమ్మై వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపింది. కొత్త సీఎం ఎంపికలో బీజేపీ హైకమాండ్.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించే చురుకైనా వ్యక్తిగా పార్టీ భావిస్తోంది.
మొదటి నుంచీ కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సామాజిక వర్గం మద్ధతు లేకుండా అక్కడ గెలవడం అంత ఈజీ కాదు. ఈ విషయం బీజేపీకి తెలియనిది ఏమీ కాదు. అందుకే యడియూరప్ప తర్వాత ఆయన వారసుడిగా.. అదే సామాజికవర్గానికి చెందిన బొమ్మైకి పట్టం కట్టారు.