Atiq Ahmad: ‘అతిఖ్‌ బ్రదర్స్‌ను అందుకే చంపాం’.. సంచలన విషయాలను వెల్లడించిన నిందితులు..

|

Apr 16, 2023 | 9:18 PM

యూపీ పోలీసుల కస్టడీలో ఉండగానే .. దారుణహత్యకు గురైన డాన్‌ అతిఖ్‌ బ్రదర్స్‌ అంత్యక్రియలు గట్టి బందోబస్తు మధ్య నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో అతిఖ్‌ అహ్మద్‌ , అష్రఫ్‌ల అంత్యక్రియలు జరిగాయి. అతిఖ్‌ ఇద్దరు కుమారులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Atiq Ahmad: ‘అతిఖ్‌ బ్రదర్స్‌ను అందుకే చంపాం’.. సంచలన విషయాలను వెల్లడించిన నిందితులు..
Atiq Ahmad
Follow us on

యూపీ పోలీసుల కస్టడీలో ఉండగానే .. దారుణహత్యకు గురైన డాన్‌ అతిఖ్‌ బ్రదర్స్‌ అంత్యక్రియలు గట్టి బందోబస్తు మధ్య నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో అతిఖ్‌ అహ్మద్‌ , అష్రఫ్‌ల అంత్యక్రియలు జరిగాయి. అతిఖ్‌ ఇద్దరు కుమారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన చోటే ఖననాన్ని పూర్తి చేశారు. అయితే, అతిఖ్‌ , అష్రఫ్‌ల షూట్‌ఔట్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. అతిఖ్‌ను చంపడానికి జైల్లో ఉన్న మరో డాన్‌ సుందర్‌బాటీ స్కెచ్‌ గీసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాల్పులు జరపడానికి ముగ్గురు నిందితులు ఉపయోగించిన ఆయుధాలను సుందర్‌ బాటీ సమకూర్చినట్టు తెలుస్తోంది. సుందర్‌బాటీకి నిందితుల్లో ఒకడైన సన్నీసింగ్‌ను అత్యంత సన్నిహితుడిగా గుర్తించారు.

టర్కీలో తయారైన రివాల్వర్‌తో అతిసమీపం నుంచి కాల్పులు జరపడంతో అతిఖ్‌ చనిపోయాడు.. నిందితులు 22 రౌండ్లు కాల్పులు జరిపారు. అతిఖ్‌కు 8 బుల్లెట్లు తగిలాయి. పోలీసుల విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. పాపులారిటీ కోసమే అతిఖ్‌ , అష్రఫ్‌ను చంపినట్టు వెల్లడించారు. నిందితులు లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యను గట్టి బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అతిఖ్‌ను చంపితే పేరు వస్తుందని, యూపీలో పాపులర్ కావొచ్చని, అతని కంటే గొప్ప డాన్‌గా ఎదగొచ్చని ఆలోచించి అదే మైండ్‌సెట్‌తో పక్కాగా ప్లానేశాం.. ప్రెస్సోళ్ల ముసుగుతో వచ్చి మట్టుబెట్టాం.. లేపేశాం.. ఇదీ వాళ్లిచ్చిన వెరీ ఫస్ట్ స్టేట్‌మెంట్స్.

అయితే అతిఖ్‌,అష్రఫ్‌ డబుల్‌మర్డర్‌కు అసలు కారణాలు వేరే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య పేర్లతో పాటు మరో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులపై పేర్లు ఉన్నాయి. అతిఖ్‌ అహ్మద్‌ ,అష్రఫ్‌ నపై యూపీ ప్రభుత్వం కేంద్రం హోంశాఖకు నివేదికను పంపించింది. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్‌కౌంటర్‌ ప్రదేశ్‌గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ , కాంగ్రెస్‌ , బీఎస్పీ నేతలు ఆరోపించారు. తన ప్రాణాలకు హానీ ఉందని సుప్రీంకోర్టులో అతిఖ్‌ పిటిషన్‌ వేసినప్పటికి పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

అతిఖ్‌ అహ్మద్‌ , అష్రఫ్‌ల హత్యపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని నియమించింది. అలహాబాద్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి త్రిపాఠితో పాటు సుబేష్‌కుమార్‌ , బ్రిజేష్‌ కుమార్‌ సోని సభ్యులుగా విచారణ కమిటీని నియమించారు. రెండు నెలల్లో కమిటీ నివేదికను ఇవ్వనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..