
చత్తీస్‌ఘడ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. 20 స్థానాల్లో తొలిదశ పోలింగ్ జరుగుతుంది. మిజోరాంలో కూడా 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అని చెప్పుకునే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకేవిడతలో పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని 20 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ చేపడతారు. తొలివిడత సమరానికి అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీసు యంత్రాగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లో మొన్న బీజేపీ నేతను నక్సల్స్ హత్యచేయడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
చత్తీస్‌ఘడ్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న 20 స్థానాల్లో 12 స్థానాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్తర్‌లో లోనే 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల కారణంగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో నిఘాను పటిష్ఠం చేసిన అధికారులు.. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.
156 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నారు.బస్తర్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..