Assam Elections 2021: ఎన్నికల వేళ అస్సాంలో బీజేపీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీ మిత్రపక్షమైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమైంది. ఆ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణంలో చేరబోతున్నట్లు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు హగ్రమ మొహిలారి ప్రకటించారు. ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి కోసం పని చేయడానికి, అస్సాంలో అవినీతి నిర్మూలనకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, మహాజాత్‌తో బీపీఎఫ్ చేతులు కలపాలని నిర్ణయించాం. బీపీఎఫ్ ఇకపై బీజేపీతో స్నేహం కానీ, పొత్తు కానీ కొనసాగించదు.’ అని పార్టీ అధ్యక్షుడు హగ్రమ మొహిలారీ తన ప్రకటనలో తెలిపారు. మహాజాత్ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి. ఎన్నికల వేళ మహాజాత్ కూటమిలో బీపీఎఫ్ చేరడంతో మరింత బలం చేకూరినట్లయ్యింది. కాగా, ప్రస్తుతం అస్సాంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇదిలాఉండగా.. బీపీఎఫ్ కూటమి నుంచి బయటికి వెళ్లడంపై బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
అస్సాంలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు..
ఈశాన్య భారతంలోని పెద్ద రాష్ట్రమైన అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా… అక్కడ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మొదటి విడతకు మార్చి రెండో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. పోలింగ్ మార్చి 27వ తేదీన నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ ఒకటిన, మూడో విడత పోలింగ్ ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతాయి. కౌంటింగ్ మే రెండో తేదీన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Also read: