దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు డిమాండ్ ఉంటుందని అన్నారు. సెమీకండక్టర్ తయారీ రంగంలోకి స్వచ్ఛమైన నీరు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎకోలాబ్ బృందం అన్ని ప్రధాన సెమీకండక్టర్ తయారీదారులతో పనిచేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మిన్నెసోటాలోని సెయింట్ పాల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ కార్పొరేషన్ ఎకోలాబ్ ఇంక్ సంస్థతో కేంద్ర మంత్రి కీలక ఒప్పందం చేసుకున్నారు. ఎకోలాబ్ సంస్థ అనేక రకాల అప్లికేషన్లలో నీటి శుద్దీకరణ, శుభ్రపరచడం, పరిశుభ్రతలో ప్రత్యేకత కలిగిన సేవలు అందిస్తుంది. స్వచ్ఛమైన నీరందించేందుకు సాంకేతికత , వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. అయితే ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా సెమీకండక్టర్ రంగాన్ని వేగవంతం చేయడంలో ఎకోలాబ్ భాగమవుతోంది. సెమీకండర్ పరిశ్రమ అవసరాలను తీర్చడంపై ఉత్పాదక సెషన్ నిర్వహించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Semiconductor manufacturing requires ultra pure water. @Ecolab team works with all major semiconductor manufacturers.
We had a productive session today on meeting the needs of our semiconductor industry.
Step by step the semiconductor ecosystem is developing as per PM… pic.twitter.com/sB3l728i0L
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 24, 2024
కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్‌సోర్స్‌డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్‌ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక భారతదేశం స్వంత AI చిప్‌లను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించింది. ఈ సంవత్సరం మార్చి నెలలో, కేంద్ర మంత్రివర్గం సుమారు రూ. 10,372 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో సమగ్ర జాతీయ స్థాయి భారత AI మిషన్‌కు ఆమోదం తెలిపింది. సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..