Aryan Khan Case: మాజీ జోనల్ డైరెక్టర్ వాంఖడేపై సీబీఐ ఉచ్చు.. విదేశీ టూర్లు, ఖరీదైన వాచెస్‌పై విచారణ

|

May 16, 2023 | 6:33 AM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో షారూక్‌ఖాన్ నుంచి సమీర్ వాంఖడే 25 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది సీబీఐ. సమీర్ వాంఖడే బ్లాక్‌మెయిల్‌ దందా చేసారంటూ వాంఖడే పై ఆరోపణలు చేసింది.

Aryan Khan Case: మాజీ జోనల్ డైరెక్టర్ వాంఖడేపై సీబీఐ ఉచ్చు.. విదేశీ టూర్లు, ఖరీదైన వాచెస్‌పై విచారణ
Sameer Wankhede
Follow us on

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్‌, అరెస్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ తాజాగా బయటికి వచ్చింది. ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే లంచం డిమాండ్ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో చెప్పింది సీబీఐ. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయని చెబుతూ.. షారూక్ కుటుంబాన్ని బెదిరించి 25 కోట్లు డిమాండ్ చేశారని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ కేసులో సమీర్ వాంఖడే విదేశీ పర్యటనలు, విలువైన చేతి గడియారాలపై కూడా విచారణ చేపట్టారు. ఇటీవల సమీర్ వాంఖడే నివాసంలో సీబీఐ అధికారులు మరోసారి సోదాలు జరిపారు. డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండా చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను వాంఖడే చెప్పలేదని ఎఫ్ఐఆర్‌లో చెప్పింది సీబీఐ. చేసిన ఖర్చులకు, వాంఖడే చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉందని తెలిపింది.

2021 అక్టోబరులో ముంబయి క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందంటూ ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఇందులో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌పై కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సమీర్ వాంఖడే ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్ 22 రోజులు జైలులో ఉన్నాడు. అయితే, సరైన ఆధారాలు సేకరించడంలో విఫలమయ్యారంటూ కోర్టు ఆర్యన్ ఖాన్‌ కు బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో జోనల్‌ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి విచారణ చేపట్టారు.

ముఖ్యంగా మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడేపై పలు ఆరోపణలు చేశారు. ఇక సీబీఐ ఎఫ్ఐఆర్‌లో వాంఖడేతో పాటు అప్పటి అధికారులు, సాక్షి.. కేపీ గోసావి, అతడి సన్నిహితుడు డిసౌజా పేర్లు ఉన్నాయి. చివరికి లంచాన్ని 25 కోట్ల నుంచి 18 కోట్లకు తగ్గించారని.. అడ్వాన్సుగా గోసావి, డిసౌజాలు 50 లక్షలు తీసుకుని తర్వాత తిరిగిచ్చేశారని కూడా సీబీఐ వెల్లడించింది. అయితే వాంఖడేపై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య క్రాంతి రేడ్కర్ ఖండించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..