Arvind Kejriwal meet CM KCR: దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లాంటి కీలక విషయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టినెన్స్ పై ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలను కూడగట్టుకునే పనిలో పడ్డారు. దీనిపై గళం విప్పాలని కాంగ్రెస్ సహా.. పలు ప్రధాన విపక్ష పార్టీలన్నింటినీ కోరుతున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో భేటీకానున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ మద్దతు కోరనున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా ఇరువురు ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చ నిర్వహించనున్నారు. అయితే, ఇద్దరు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి పయనంకానున్నారు. కేజ్రీవాల్‌తో పాటు విద్యాశాఖ మంత్రి అతిషి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ సీఎంఓకు సమాచారం అందించింది.
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై ఇప్పటికే కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతు కోరారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో భేటీ కానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..