Delhi CM Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం 22 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. వందలాది మంది మరణిస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికోసం ఢిల్లీ ప్రభుత్వం 1.34 కోట్ల డోసుల కొనుగోలుకు అమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్ కొనుగోలు, దాన్ని ప్రజలకు అందించే ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని దానికోసం ప్రణాళికను సైతం రూపొందించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితయ్యే అవకాశం ఉందని.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వాళ్లు డబ్బులు చెల్లించాల్సి రావచ్చని తెలిపారు.
అయితే.. కోవిడ్-19 వ్యాక్సీన్ల ధర అందరికీ సమానంగా ఉండాలని.. ఈ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. వ్యాక్సీన్ తయారీదారులు కూడా ధరను తగ్గించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. డోసు రూ.150కే ఇవ్వాలని కోరారు. ఇది మానవత్వంతో సాయం చేయాల్సిన సమయమని.. లాభాల కోసం చూసే సమయం కాదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. లాభాలను అర్జించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. కాగా.. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం గతవారం నుంచి లాక్‌డౌన్ నిర్వహిస్తున్నారు. కేవలం అత్యవసర సర్వీసులకే మినహాయింపు ఇచ్చారు.
Also Read: