ఆర్టికల్ 370 . .నెహ్రు, వాజ్‌పేయి ఏమన్నారు ? మరి మోదీ?
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి ఈ ఆర్టికల్ వెనుక సుమారు ఏడు దశాబ్దాల ‘ చరిత్ర ‘ ఉంది. నాడే భారీ కసరత్తు జరిగింది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే.. అది 1947 వ సంవత్సరం.అక్టోబర్ 26. అప్పటి కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వంతో యాక్సెసెస్ ట్రెటీ (కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్న ఒప్పందం) కుదుర్చుకున్నారు. నాడు ముస్లిములు […]
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి ఈ ఆర్టికల్ వెనుక సుమారు ఏడు దశాబ్దాల ‘ చరిత్ర ‘ ఉంది. నాడే భారీ కసరత్తు జరిగింది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే.. అది 1947 వ సంవత్సరం.అక్టోబర్ 26. అప్పటి కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వంతో యాక్సెసెస్ ట్రెటీ (కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్న ఒప్పందం) కుదుర్చుకున్నారు. నాడు ముస్లిములు మెజారిటీగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సాహసోపేతమే.. కానీ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల పరంగా కాశ్మీర్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించక తప్పలేదు. అనంతరం నాటి ఆ రాష్ట్ర సీఎం షేక్ అబ్దుల్లాకు, హరిసింగ్ నేతృత్వంలోని పాలకవర్గానికి మధ్య ఎన్నో సంప్రదింపుల తరువాత ఆర్టికల్ 370 ని ఖరారు చేశారు.
1949 లో నాటి ఢిల్లీ సర్కార్ కూడా ఇందుకు ఓకె చెప్పింది. అంబేద్కర్ నేతృత్వాన రాజ్యాంగ బద్దమైన అధికరణంగా రూపుదిద్దుకుంది. కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నదే దీని ప్రధాన ధ్యేయం. 1965 ఏప్రిల్ 10 న ఈ రాజ్యాంగ చర్యను అప్పటి అసెంబ్లీ సవరించింది. అసెంబ్లీ ఆమోదం పొందాకే భారతీయ రాజ్యాంగ సవరణలు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
1963 నవంబర్ 27 న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు.. పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆర్టికల్ 370 అధికరణం ప్రకారం.. రద్దుకు సంబంధించిన ఏ ప్రతిపాదన అయినా ప్రత్యేక ప్రతిపత్తి నిర్ణయంపై అది ప్రభావం చూపుతుందన్నారు. ఈ అధికరణం కొన్ని తాత్కాలిక నిబంధనల్లో ఒక భాగం.. ఇది రాజ్యాంగంలో శాశ్వత భాగం కాదు.. ఇది కొనసాగినంత కాలం రాజ్యాంగంలో ప్రత్యేక భాగంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా దేశంలో ఇంటిగ్రేట్ అయిన రాష్ట్రం కాదని అందరికీ తెలిసిందేనని, భారత దేశంలో ఉంటున్న కాశ్మీరేతరులు ఆ రాష్ట్రంలో భూములు, ఇతర ఆస్తులు కొనడానికి అనుమతి లేదన్న విషయాన్ని ఈ ఆర్టికల్ నిర్దేశిస్తోందని నెహ్రు అన్నారు. ఇది మంచి నిబంధనే.. ఇది కొనసాగాల్సిందే అని నొక్కి చెప్పారు.
అయితే ఆ తరువాత ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు సంభవించాయి. ప్రజల సెంటిమెంట్లు మారుతూ వచ్చాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్ ప్రభావం కూడా దీనిపై పడుతూ వచ్చింది. నాటి పరిణామాల నేపథ్యంలో కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నివేదించాలని నెహ్రు సూచించారు. కాశ్మీర్‌లో ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) జరపాలని, కాశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. కానీ నాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ చేతి ‘ నుంచి ఈ సమస్యను నెహ్రు తన హస్తగతం చేసుకున్నారని, మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ ఇటీవల వ్యాఖ్యానించారు. నెహ్రు హయాంలో పోర్టు ఫోలియో లేని మంత్రిగా ఉన్న గోపాల స్వామి అయ్యంగార్ కూడా కొన్ని సవరణలు సూచించారు.
ఇదిలా ఉండగా.. 2003 ఏప్రిల్ లో నాటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి.. కాశ్మీర్ అంశంపై పార్లమెంటులో మాట్లాడుతూ.. తుపాకీ వల్ల సమస్యలు పరిష్కారం కావని, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లాలని, కాశ్మీరీల సమస్యల పరిష్కారానికి ఢిల్లీ తలుపులు ఎప్పడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. వారి ఇబ్బందులను కేంద్రం గుర్తించిందని, వారు ఎప్పుడైనా కేంద్రంతో చర్చలకు రావచ్చునని అన్నారు.
‘ ఇన్సానియత్ ‘ (మానవత్వం), జమూరియాత్ (ప్రజాస్వామ్యం), కాశ్మీరియాత్ (హిందూ-ముస్లిం సమైక్యత) అన్న మూడు సిధ్ధాంతాలకు తాము ప్రాధాన్యమిస్తామని వాజ్ పేయి చెప్పారు. అయితే వివాదాస్పదమైన ఆర్టికల్ 370 అధికారణాన్ని ఆయన పరోక్షంగా సమర్థించినట్టే అయింది. అందువల్లే పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తాజాగా.. నాటి దివంగత ప్రధాని వాజ్‌పేయి వ్యాఖ్యలను బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు.
ఇక తాజాగా..బీజేపీ ఎప్పటినుంచో ఈ ఆర్టికల్ ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. ప్రధాని మోదీ..కీలకమైన ఈ అంశంపై ఇప్పటివరకూ నోరెత్తలేదు. ఈ విషయంపై ఆయన బుధవారం కీలక ప్రసంగం చేయనున్నారు. కానీ..బీజేపీ అభిప్రాయాలే ఆయనవి కూడా కనుక హోమ్ మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం మాదిరే ఆయన కూడా వ్యాఖ్యానించవచ్ఛునని భావిస్తున్నారు.