Ambulance Accident: హెలికాప్టర్ ప్రమాదంలో బుధవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే.. బిపిన్ రావత్, ఆయన భార్య సహా ఇతర భద్రతా దళాల సిబ్బంది భౌతికకాయాలను తమిళనాడు నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. అక్కడి నుంచి మొత్తం 13 పార్థివదేహాలను భారత వైమానిక దళం సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో న్యూ ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహాలను అంబులెన్స్‌ల్లో సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్సులు వరుసగా వెళ్తున్న క్రమంలో ముందున్న వాహనాన్ని వెనకవున్న అంబులెన్సు ఢీకొట్టింది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతలో తృటిలో ప్రమాదం తప్పింది. కోయంబెత్తుర్ మెట్టుపాళయం వద్ద జరిగిన ఘటనలో డ్రైవెర్‌కి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ముందున్న అంబులెన్సుని వెనకవున్న వాహనం ఢికొట్టిందని పేర్కొన్నారు. అయితే.. గాయాలైన డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వేరే అంబులెన్సును తెప్పించి.. దానిలోకి పార్థివ దేహాలను మార్పించి అక్కడినుంచి తరలించారు.
మృతదేహాలను సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈరోజు సాయంత్రం పాలం టెక్నికల్ ఏరియాలో జనరల్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాళులర్పించనున్నారు. కాగా.. ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే భారత వైమానిక దళం (IAF) విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలకు శుక్రవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: