తమిళనాడు ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.. కంచి కామాక్షి, మధుర మీనాక్షి.. ఇలా ఎన్నో ప్రముఖ ఆలయాలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో ఓ కుగ్రామం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. రాతి కొండల మధ్య ఉండే ఈగ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ కుగ్రామం పర్యాటకులకు ఓ మంచి ప్రదేశం. తాజాగా దక్షిణ భారతదేశంలోనే తొలి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ఈగ్రామం గుర్తింపు పొందింది.
తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని అరిట్టపట్టి గ్రామాన్ని మొదటి బయోడైవర్సిటీ గ్రామంగా ప్రకటించారు. అరిట్టపట్టి గ్రామానికి ఈ హోదా రావడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతం యొక్క సహజ అందమే. అరిట్టపట్టి గ్రామానికి వేల సంవత్సరాల నాటి చారిత్రక వారసత్వం ఉంది. దాదాపు 193.21 హెక్టార్లలో ఉండే ఈ ప్రాంతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు రాతి కొండల చుట్టూ ఈ గ్రామం ఉంటుంది. అరిటపట్టి గ్రామం ఏడు కొండల సముదాయం. 72 సరస్సులు, 200 సహజ నీటి బుగ్గలు, 3 ఆనకట్టలు కలిగి ఉంది ఈ గ్రామం. ఇక్కడి ఆనైకొండన్ సరస్సు పదహారవ శతాబ్దంలో పాండ్యుల పాలనలో నిర్మించబడింది. అరిటపట్టి గ్రామంలోని కొండల్లో 250 రకాల పక్షులు ఉన్నాయి. వీటిలో లాగర్ ఫాల్కన్, షాహిన్ ఫాల్కన్, బోనెలిస్ ఈగల్ అనే మూడు ప్రధానమైన రాప్టర్స్ కూడా ఉన్నాయి. చీమలు, కొండచిలువలతో పాటు అరుదైన రకరకాల వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అనేక పక్షులు, జంతువులకు నిలయంగా అరిటపట్టి గ్రామం నిలుస్తోంది. వివిధ జైన శిల్పాలు, తమిళ బ్రాహ్మీ శాసనాలు, కర్సివ్ శాసనాలు, 2200 సంవత్సరాల నాటి కుడైవర్ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన కాలంనాటి చారిత్రక కట్టడాలు ఈ ప్రాంతానికి శోభను చేకూరుస్తున్నాయి.
అరిటపట్టి గ్రామాన్ని జీవవైవిధ్య వారసత్వ సంపదగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలోని పర్యావరణాన్ని, రకరకాల జీవరాశుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఎన్నో రాతి విగ్రహాలు సైతం ఈ ప్రాంతంలో ఉండటంతో అనేక సంప్రదింపుల తర్వాత ఈ గ్రామాన్ని జీవవైవిధ్య వారసత్వ సంపదగా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఎన్నో రకాల పక్షు జాతులు, జంతువులు అంతరించిపోతున్న తరుణంలో దాదాపు 250 రకాల పక్షు జాతులను కలిగిన ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అరిటపట్టి గ్రామాన్ని మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించడంతో, ఇదొక చారిత్రక ప్రదేశంగా అవతరించిందని తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ఈ ప్రాంతంలో జీవరాశులను, పురాతన కట్టడాలను సంరక్షించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహడపుతుందంటున్నారు సుప్రియా సాహు.
వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఉండాలని అరిటపట్టి ప్రజలు కూడా తీర్మానం చేశారు. ఈ గ్రామాన్ని బయోడైవర్సిటీ హెరిటెజ్ గా ప్రకటించాలని 11 ఏళ్లుగా ఇక్కడి గ్రామస్తులు ప్రయత్నిస్తుండగా.. ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరెక్కడా కనిపించని అనేక స్థానిక పక్షుజాతులను కలిగి ఉండటంతో ఇది జీవసంబంధమైన పర్యాటక సంభావ్యతతో పాటు పురావస్తు పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. మధురైకు సమీపంలో ఉండే ఈ గ్రామం పర్యాటకంగానూ ఎంతో ప్రాచుర్యం పొందింది.
Congratulations Madurai ? Arittapatti in Madurai gets Notified by GOTN as the first Biodiversity Heritage Site in Tamil Nadu. #Arittapatti is nothing less than a biodiversity paradise with several endemic species and a historical heritage which dates back to thousands of years pic.twitter.com/4YxBQrsNmb
— Supriya Sahu IAS (@supriyasahuias) November 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..