ప్రేమ పేరిట వివాహితకు వేదింపులు! నో.. చెప్పిందని కారులో ఉంచి చెరువులోకి తోసేశాడు..
అప్పటికే వివాహమైన ఓ మహిళతో.. ప్రేమ పేరిట మరో వివాహితుడు కొన్ని నెలలుగా వెంటపడసాగాడు. తానొప్పుకుంటే భార్యను వదిలేసి, పెళ్లి కూడా చేసుకుంటానని కబుర్లు చెప్పాడు. అయితే ఆమె సదరు వీర ప్రేమికుడి ప్రేమను నిరాకరించింది. దీంతో పగ పెంచుకున్నసైకోగాడు దారుణంగా ఆమెను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన..

బెంగళూరు, ఆగస్ట్ 21: ప్రేమ మత్తులో ఓ వ్యక్తి మృగంగా మారాడు. అప్పటికే వివాహమైన ఓ మహిళతో.. ప్రేమ పేరిట మరో వివాహితుడు వెంటపడసాగాడు. ఆమె తన ప్రేమను నిరాకరించిందని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత (32)కు కొంత కాలం క్రితం వివాహం జరిగింది. అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా ఆమె తన భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటుంది. హసన్‌లోనే స్థానికంగా ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వివాహిత వ్యక్తి పరిచయమయ్యాడు.
అయితే గత కొన్ని నెలలుగా రవి.. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడసాగాడు. ఆమె ఆంగీకరిస్తే తన భార్యను విడిచిపెట్టి తనను పెళ్లి కూడా చేసుకుంటానని ఒత్తిడి చయసాగాడు. అయితే శ్వేత అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో శ్వేతపై పగ పెంచుకున్న రవి, శ్వేతను హతమార్చాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా శ్వేతను తన కారులో ఎక్కించుకుని చందనహళ్లి సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును వేగంగా చెరువులోకి తీసుకెళ్లాడు. అనంతరం కారు డోరు ఓపెన్ చేసుకుని ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. కానీ శ్వేత మాత్రం ఊపిరాడక మరణించింది. అనంతరం ఏమీ ఎరగనట్లు పోలీసులకు సమాచారం అందించాడు.
తన కారు ప్రమాదవశాత్తు చెరువులో పడిందని, అందులో తన స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని వారికి తెలిపాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు రాత్రిపూట రెస్క్యూ బృందాలతో కారును బయటకు తీయించారు. అయితే, శ్వేత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో రవి ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రవిని అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




