నిర్భయ కేసు..చిక్కుముడులెన్నో ! దోషుల ఉరితీతపై ఇంకా వీడని సస్పెన్స్ !

నిర్భయ దోషుల ఉరి ఓ మిస్టరీగా మారింది. దోషులు.. అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ.. ఈ నలుగురినీ ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి తీయవలసి ఉంది.. అయితే ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు కనిపిస్తున్నాయి. పరస్పర విభిన్న కథనాలూ వినిపిస్తున్నాయి. ఈ నలుగురూ కలిసి ఒకే నేరానికి పాల్పడ్డారు గనుక.. వీరిని వేర్వేరుగా కాక..  ఒకేసారి ఉరి తీయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది. దోషులు తమ […]

  • Umakanth Rao
  • Publish Date - 12:29 pm, Fri, 31 January 20
నిర్భయ కేసు..చిక్కుముడులెన్నో ! దోషుల ఉరితీతపై ఇంకా వీడని సస్పెన్స్ !

నిర్భయ దోషుల ఉరి ఓ మిస్టరీగా మారింది. దోషులు.. అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ.. ఈ నలుగురినీ ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఉరి తీయవలసి ఉంది.. అయితే ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు కనిపిస్తున్నాయి. పరస్పర విభిన్న కథనాలూ వినిపిస్తున్నాయి. ఈ నలుగురూ కలిసి ఒకే నేరానికి పాల్పడ్డారు గనుక.. వీరిని వేర్వేరుగా కాక..  ఒకేసారి ఉరి తీయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది. దోషులు తమ మెర్సీ , క్యురేటివ్ పిటిషన్లను వేర్వేరుగా… అదేపనిగా  దాఖలు చేయడం, అటు రాష్ట్రపతి, ఇటు న్యాయమూర్తులు ప్రతి ఒక్క దోషి వాదనను వేరువేరుగా ఆలకించడం.. అనేకమందిలో.. అనేక సందేహాలను లేవనెత్తుతోంది. అన్ని లీగల్ మార్గాలూ మూసుకుపోయాక.. ఒక్కొక్కరిని వేర్వేరుగా ఉరి తీయలేరన్నదే ఈ డౌట్!

ఈ సందర్భంగా  1982 లో ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును గుర్తు చేసుకోవలసి ఉంటుంది. ఆ కేసులో ఓ దోషికి అన్యాయం జరిగింది. అంటే ఒకవిధంగా చెప్పాలంటే ఒకే నేరానికి పాల్పడిన దోషులను  వేర్వేరుగా ఉరి తీయరాదన్న తీర్పునకు అది దారి తీసింది.  ఆ కేసులో ఒకరి శిక్షను యావజ్జీవ జైలు శిక్షగా తగ్గించగా.. మరొకరి ఉరిపై కోర్టు స్టే విధించింది. మూడో దోషి పరిస్థితే విచిత్రంగా.. అగమ్యగోచరంగా మారింది. తన సహచర దోషుల పోకడ గురించి ఈ దోషికి నాడు ఏమీ తెలియదట. (అతగాడినొక్కడినే ఆ కేసులో ఉరి తీయగా మిగిలినవారు తప్పించుకున్నారు). ఆ విధమైన అన్యాయం మళ్ళీ జరగకుండా చూసేందుకు.. దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. అదే.. హర్ బన్స్ సింగ్ వర్సెస్ యూపీ స్టేట్ కేసు.. ఓ మర్డర్ కేసులో హర్ బన్స్ సింగ్, మొహిందర్ సింగ్, కాశ్మీరా సింగ్, జీతా సింగ్ దోషులుగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో మొహిందర్ సింగ్ పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించాడు. దాంతో హర్ బన్స్, కాశ్మీరా, జీతాసింగ్ జైలుకు వెళ్లారు. వీరికి యూపీ పిలిభిత్ లోని సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ముగ్గురు తమ శిక్షను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేయగా.. నెల రోజుల తరువాత హైకోర్టు దాన్ని సమర్థించింది.  జీతాసింగ్ 1976 ఏప్రిల్ లో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయగా..దాన్ని కోర్టు కొట్టివేసింది. కాశ్మీరా సింగ్ కూడా మరో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా.. దాన్ని కోర్టు అనుమతించింది. రెండేళ్ల తరువాత 1977 ఏప్రిల్లో న్యాయమూర్తులు ఫజల్ అలీ, భగవతిలతో కూడిన బెంచ్.. కాశ్మీరా శిక్షను యావజ్జీవ జైలు శిక్షగా మార్చింది. హర్ బన్స్ సింగ్ మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా దాన్ని కోర్టు 1978 లో కొట్టివేసింది. 1980 లో అతని రివ్యూ పిటిషన్ ను సైతం తిరస్కరించింది. ఆ తరువాత అతడిని ఉరి తీయాలని కోర్టు  ఉత్తర్వులిచ్చినప్పటికీ అతగాడు మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.. అతడి ఉరిపై కోర్టు స్టే విధించింది. కానీ జీతాసింగ్ ఎలాంటి రివ్యూ, లేదా క్యురేటివ్ పిటిషన్ వేయకపోవడంతో అతడిని 1980 అక్టోబరు 6 న ఉరి తీశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే.. ఈ హత్య కేసులో ముఖ్య సూత్రధారి అయిన హర్ బన్స్ సింగ్ ‘ తప్పించుకున్నాడు’.

తీహార్ జైలు మాన్యువల్ ఏమంటోంది ?

ఇక నిర్భయ కేసు విషయానికే వస్తే.. ఈ కేసులో వినయ్ మెర్సీ పిటిషన్ ఇంకా రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉండగా.. మరో ఇద్దరు క్షమాభిక్ష పిటిషన్లను దాఖలు చేయలేదు. అయితే ముకేశ్ సింగ్ కు గల లీగల్ మార్గాలన్నీ మూసుకుపోయాయిగనుక అతడిని ఉరి తీయవచ్చునని తీహార్ జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఈ నలుగురు దోషులనూ వేర్వేరుగా ఉరి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వినయ్ శర్మను ఫిబ్రవరి 1 న ఉరి తీయబోరని, కానీ మిగిలిన ముగ్గురిని (పవన్, ముకేశ్, అక్షయ్) ఉరి తీయవచ్ఛునని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వినయ్ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న నేపథ్యంలో అతని పిటిషన్ ని రాష్ట్రపతి తోసిపుచ్చినప్పటికీ.. అతడికి ఇంకా 14 రోజుల టైం ఉంది. అంటే ఈ పిటిషన్ తిరస్కరణకు గురైన తేదీకి, ఉరి తేదీకి మధ్య ఇన్ని రోజులు గ్యాప్ ఉందన్నమాట ! అలాగే అక్షయ్ మెర్సీ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా ఆప్షన్ ఉంది. దాంతో అతడికి కూడా 14 రోజుల గ్యాప్ లభిస్తుంది. దోషి పవన్ ఒక్కడే క్యురేటివ్ గానీ మెర్సీ పిటిషన్ గానీ దాఖలు చేయలేదు గనుక.. తన ఉరిని జాప్యం చేసేందుకు అతనికి ఆప్షన్ ఉంది. కానీ ముకేశ్ కి ఎలాంటి లీగల్ మార్గాలూ లేకపోవడంతో మొదట అతడిని ఉరి తీయవచ్చునని తీహార్ జైలు  మాన్యువల్ అభిప్రాయపడుతోంది. ఈ మాన్యువల్ నిబంధనల ప్రకారం.. ఒకే నేర ఘటనలో ఒకరికంటే ఎక్కువమంది దోషులకు ఉరి శిక్ష విధించాలని అనుకున్నప్పుడు ఒకరు అప్పీలు పిటిషన్ దాఖలు చేసినా.. ఇతర అందరు నిందితుల శిక్షలను వాయిదా వేయవచ్చునట..

ఏమైనా…. నిర్భయ దోషుల ఉరితీత జైలు అధికారులకు తలనొప్పిగా మారింది. ముకేశ్, పవన్, అక్షయ్ లను ఉరి తీయాలా లేక వినయ్ విషయంలో నిర్ణయం వెలువడేంతవరకు వేచి ఉండాలా అన్నది వారికి  సమస్యగా మారింది. అందువల్ల వీరు ఓ సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయం తీసుకోవచ్చు.  ఒకరిని ఉరి తీస్తే దానివల్ల ఇతర దోషులపై ‘ సైకలాజికల్ ఎఫెక్ట్’ పడుతుందని వారు తర్జనభర్జన పడుతున్నారు. అయితే చాలావరకు ముకేశ్ ఉరితీత ఖాయమని అంటున్నారు.