సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఆధారంగా చేసుకుంటున్న నేరగాళ్లు.. యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ వీళ్ల పాలిట వరంగా మారిందా అనిపిస్తోంది. ఎప్పుడు, ఎలా దాడులకు తెగబడుతున్నారో అంచనా వేయలేని పరిస్థితి వచ్తేస్తోంది. ఏ చిన్న ఆధారం దొరికినా దాని నుంచి ఆ వ్యక్తుల ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొట్టేస్తున్నా రు. తాజాగా ముంబయికి చెందిన ఓ మహిళ ఖాతానుంచి ఏకంగా 9 లక్షల రూపాయలను దోచుకున్నారు ఈ కేటుగాళ్లు. ముంబయికి చెందిన పుష్పలత ప్రదీప్ అనే మహిళ పదవీ విరమణ తర్వాత పీఎఫ్ మొత్తాన్ని యూనియన్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. తన పిక్స్‌డ్ డిపాజిట్‌లో వచ్చిన సమస్యకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు గ్రీవెన్స్ వెబ్‌సైట్‌లో ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎర్రర్ చూపించింది. చాలా సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి తన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా ఓ పాప్ అప్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాట్సాప్ ద్వారా లింక్ పంపిస్తున్నామని, ఫిర్యాదు చేసేందుకు దానిపై క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని కోరారు. వాళ్లు అడిగిన వివరాలు తెలియజేస్తున్న పుష్పలతకు మధ్యలో అనుమానం వచ్చింది. ఈ వివరాలన్నీ ఎందుకని వారిని ప్రశ్నించింది. ఇదంతా ఫిర్యాదు ప్రక్రియలో భాగమేనని, భయపడాల్సిన పని లేదంటూ కేటుగాళ్లు మాయమాటలు చెప్పారు. దీంతో ఆమె.. సదరు యాప్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా ఎంటర్ చేసేశారు.
ఇంకేముంది…కొద్దిసేపటికే తన ఖాతాలోని డబ్బంతా డెబిట్ అయినట్లు ఆమెకు ఎస్‌ఎంఎస్ వచ్చింది. దీంతో కంగుతున్న ఆమె వెంటనే కస్టమర్ కేర్ నంబర్‌తో యూనియన్ బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు దాహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..