AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు నెలకు రూ.3000, 6 నెలల్లోనే యూసీసీ.. మమతకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ హామీల వర్షం..

బెంగాల్ పోరులో గెలుపే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 6 నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి, మహిళలకు నెలకు రూ.3,000, చొరబాటుదారుల ఏరివేత.. ఇలా హామీల వర్షం కురిపిస్తూ మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. అమిత్ షా ప్రకటించిన ఆ సంచలన హామీలు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహిళలకు నెలకు రూ.3000, 6 నెలల్లోనే యూసీసీ.. మమతకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ హామీల వర్షం..
Amit Shah Releases Bjp Manifesto For West Bengal
Krishna S
|

Updated on: Apr 10, 2026 | 2:10 PM

Share

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. బెంగాల్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తూ బెంగాల్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. చొరబాటుదారుల ఏరివేత నుంచి మహిళలకు ఆర్థిక భరోసా వరకు అమిత్ షా ప్రకటించిన అంశాలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో సెన్సేషన్ రేపుతున్నాయి. ఇంటి పెద్దగా ఉన్న ప్రతి మహిళా ఖాతాలో ప్రతి నెలా రూ.3000 జమ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దుర్గా సురక్ష స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చే చొరబాటుదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అమలు చేయడంతో పాటు గోవధను అరికట్టడతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 7వ పే కమిషన్‌ను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లిస్తామని చెప్పారు. ‘‘నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం చేస్తాం. ఉత్తర బెంగాల్‌లో కొత్తగా ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తాం. బెంగాల్ వారసత్వాన్ని చాటేలా వందేమాతరం మ్యూజియం నిర్మిస్తాం’’ అని షా ప్రకటించారు.

టీఎంసీ, వామపక్షాలపై అమిత్ షా ఫైర్

“గత 50 ఏళ్లుగా వామపక్షాలు, టీఎంసీ బెంగాల్‌ను నాశనం చేశాయి. భయం లేని బెంగాల్‌ను సృష్టించడమే బీజేపీ లక్ష్యం. బెంగాల్ ముఖ్యమంత్రి బెంగాలీనే అవుతారు. మా ఆదేశాలు ఢిల్లీ నుంచి వస్తాయి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పని చేసే ప్రభుత్వం మాది కాదు’’ అంటూ అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులను ఏరివేయడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి పూర్తి మెజారిటీతో బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Follow Us