AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. క్రైమ్ స్కెచ్‌కి AI చాట్‌బాట్ సాయం!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసు దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు హత్యల ప్రణాళిక కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నిందితుల చాట్ హిస్టరీ వివరాలను అందించాలని సంబంధిత ఏఐ సంస్థకు బెంగళూరు పోలీసులు లేఖ రాశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..

బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. క్రైమ్ స్కెచ్‌కి AI చాట్‌బాట్ సాయం!
AI Chatbot and Bengaluru Triple Murder Case
Srilakshmi C
|

Updated on: Jul 23, 2026 | 12:55 PM

Share

బెంగళూరు, జులై 23: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చంపింది సొంత కూతురే అయినప్పటికీ హత్యల ప్రణాళికను నిందితులు దాదాపు ఆరు నెలల పాటు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. జూన్ 22న బెంగళూరులో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), కుమార్తె సుప్రియ (19)లను వారి ఇంట్లోనే కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో మృతదంపతుల పెద్ద కుమార్తె శ్వేత, ఆమెతో సహజీవనం చేస్తున్న కెన్నెత్‌ను పోలీసులు పుదుచ్చేరిలో వేర్వేరుగా అరెస్టు చేశారు. హత్యల అనంతరం ఇద్దరూ పరారై అరెస్టు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

రూ.50 లక్షల అప్పే హత్యలకు కారణమా?

కెన్నెత్ క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రారంభించేందుకు శ్వేత తన తల్లి ముత్తులక్ష్మి వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే వ్యాపారం ఆశించిన విధంగా సాగకపోవడంతో అప్పు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆర్థిక ఒత్తిడి కారణంగా హత్యలకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అత్యంత సంచలనంరేపిన అంశం ఏమిటంటే, హత్యల ప్రణాళికలో ప్రతి దశలోనూ నిందితులు ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎలా హత్య చేయాలి? మృతదేహాలను ఎలా మాయం చేయాలి? రక్తపు మరకలను ఎలా తొలగించాలి? వంటి ప్రశ్నలను చాట్‌బాట్‌కు అడిగినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, క్లౌడ్ కిచెన్ కోసం కెన్నెత్ నిర్మించిన ఫర్నేస్‌ను మృతదేహాలను దహనం చేయడానికి ఉపయోగించవచ్చా అనే విషయంపై కూడా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. నేరాన్ని ఇద్దరూ కలిసి అమలు చేసినప్పటికీ, మొత్తం ప్రణాళిక రూపకల్పనలో కెన్నెత్ కీలక పాత్ర పోషించాడు.

మానసిక సమస్యలతో కెన్నెత్

పోలీసులు, మానసిక నిపుణుల పరిశీలనలో కెన్నెత్ తీవ్ర సామాజిక ఒంటరితనంతో జీవించినట్లు గుర్తించారు. అతనికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేవని, ఆర్థికంగా పూర్తిగా శ్వేతపై ఆధారపడి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే కెన్నెత్ ప్రభావం వల్లే శ్వేత ఐటీ రంగంలోని తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు ద్వారా నేర ప్రణాళికలో కృత్రిమ మేధస్సు సాంకేతికత దుర్వినియోగం అయ్యే అవకాశాలపై కొత్త చర్చ మొదలైంది. ఏఐ టూల్స్ నేరాలకు ఉపయోగించే ప్రయత్నాలను ఎలా నియంత్రించాలనే అంశంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల ఏఐ చాట్ పూర్తి రికార్డులు వెలుగులోకి వస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Follow Us