Trains: అందరికి పెద్ద పండుగ సంక్రాంతి.. సంక్రాంతి వచ్చిందంటే ఆసందడే వేరు. ఎక్కడ ఉన్నా.. సెలవులు తీసుకుని సొంతూరుకు పోవల్సిందే.. పండుగలో కుటుంబ సభ్యులందరితో సరదాగా గడపాల్సిందే. అయినా ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కదా.. అనుకుంటున్నారా.. అయితే పండక్కి రైలులో ఊరు వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. పండగకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. రైళ్లలో రిజర్వేషన్లు అప్పుడే నిండిపోయాయి. ఒక్కో బండిలో 500కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ఇక గోదావరి, ఫలక్‌నుమా, లోకమాన్య తిలక్- విశాఖ, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్‌కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ఏదోలా ప్రయాణించేద్దామనుకునేవారికి ఆఅవకాశం కూడా లేకుండా నిరీక్షణ జాబితా చాంతాడంత ఉంది. సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందు నుంచే చాలా మంది ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. 120 రోజుల ముందే రిజర్వేషన్లు ప్రారంభం కావడంతో.. ప్రారంభమైన వెంటనే ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందు రోజు ఓపెన్ అయ్యే తత్కాల్ మీదే ఆధారపడి ఉన్నారు. తత్కాల్ లో అయినా టికెట్ దొరుకుతుందనే ఆశలో కొంత మంది ప్రయాణీకులున్నారు.
వచ్చే ఏడాది జనవరి 12, 13 తేదీల్లో రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ, కాకినాడ, నర్సాపూర్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లేవారికి రిజర్వేషన్ దొరకట్లేదు. సెప్టెంబర్ 16వ తేదీ శక్రవారం ఉదయం 9 గంటలకు పరిస్థితి చూస్తే సికింద్రాబాద్-కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో 12, 13 తేదీల్లో వరుసగా 331, 388 మంది చొప్పున నిరీక్షణ జాబితాలో ఉన్నారు. సికింద్రాబాద్-నర్సాపూర్, కాచిగూడ-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. విశాఖపట్నం గరీబ్‌రథ్‌లోనూ 12, 13 తేదీల్లో వరుసగా 276, 219 మంది నిరీక్షణలో ఉన్నారు. ఫలకనామా ఎక్స్ ప్రెస్ లో అయితే ఫస్ట్ ఎసీలో వెయిట్ లిస్ట్ 2 మినహిస్తే మిగిలిన అన్ని క్లాసుల్లోనూ రిగ్రెట్ కు వచ్చేసింది. అంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కూడా బుక్ చేసుకునే అవకాశం లేదు.
రైలులో వెళ్దామనుకునే వారికి టికెట్లు దొరకకపోవడంతో ఇక ఆర్టీసీ, ప్రయివేటు బస్సులుల లేదా సొంత వాహనాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పండుగ సీజన్ లో ఆర్టీసీతో పాటు ప్రయివేటు ట్రావెల్స్ సాధారణం కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తాయి. దీంతో తక్కువ ఛార్జీతో రైలులో వెళ్లాలనుకునేవారికి కొంత నిరాశ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్-విశాఖపట్నం రైలులో స్లీపర్ టికెట్ ధర రూ.410 కాగా, థర్డ్ ఏసీకి రూ.1,080. గరీబ్‌రథ్‌లో రూ.770 మాత్రమే. ఆర్టీసీ బస్సుల్లో స్లీపర్ టికెట్ ధర రూ.1,140 కాగా, ఏసీ బస్సుల్లో రూ.1,696 నుంచి రూ.2,295 వరకు ఉన్నాయి. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలుంటాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి వెళ్లిరావాలంటే ఖర్చు ఎక్కువయ్యే స్థితి నెలకొంది. ఇక రైలులో టికెట్లు దొరకలేని వారంతా బస్సు అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రైలులో 120 రోజుల ముందుగా రిజర్వేషన్ ను అనుమతిస్తారు. బస్సుల్లో 60 రోజుల ముందుగా బుకింగ్ లను అనుమతిస్తారు. ఇక చివరిగా రైల్వే శాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేక రైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశతో రైలు ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..