హైదరాబాద్‌లో రోజుకి నలుగుర్ని… దేశ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని చంపేస్తున్న వాయుకాలుష్యం

| Edited By: Ravi Panangapalli

Jul 19, 2024 | 9:45 AM

లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ఇటీవల ‘‘భారతదేశంలోని పది నగరాల్లో పరిసర వాయు కాలుష్యం, రోజువారీ మరణాలు’’ అనే అంశంపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌లోని పది నగరాలు.. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం నిర్వహించింది. ఏటా ఈ నగరాల్లో..

హైదరాబాద్‌లో రోజుకి నలుగుర్ని... దేశ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని చంపేస్తున్న వాయుకాలుష్యం
Air Pollution
Follow us on

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యం.. పర్యావరణం పచ్చగా ఉంటేనే సకల జీవరాశులు సుఖ సంతోషాలతో జీవించగలవు.. ‘‘పర్యావరణ పరిరక్షణ.. పర్యావరణానికి పాటుపడాలి.. పర్యావరణ హితం కోసం మనం నడుంబిగించాలి.. ముందు తరాలకు అవసరమైన వనరుల కోసం పర్యావరణాన్ని కాపాడాలి’’.. ఇలాంటి నినాదాలను మనం చిన్ననాటి నుంచి వింటున్నవే.. చదువుకుంటున్నవే.. వాస్తవానికి విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయమైన పుడమితల్లిని.. ప్రకృతిని.. పర్యావరణాన్ని మనం ఎల్లప్పుడూ కలుషితం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది.. అంటే మానవులతోపాటు జీవకోటి మనుగడ సాధ్యమవుతుంది.. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న ప్రతిదీ.. అంటే నేల, నీరు, జంతువులు, మొక్కలు వంటి సజీవ, నిర్జీవ వస్తువులను పర్యావరణం అంటారు.. అవి మన పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది భూమిపై జీవం పోషణలో సహాయపడే ప్రకృతి వరంగా అభివర్ణిస్తాం.. కానీ.. ఆధునిక ప్రపంచం మాత్రం దీనికి విరుద్దంగా పరుగులు తీస్తోంది.. పర్యావరణానికి హాని తలపెట్టి మరి.. ప్రాణాలను పోగొట్టుకునే వరకు చేరుకుంది. అంటే.. పర్యావరణ కాలుష్యం ఏమాత్రం జరగుతుందో మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది..

పర్యావరణ కాలుష్యం ప్రస్తుతం జీవకోటికి పెనుముప్పుగా మారింది.. ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో.. అంతే పర్యావరణ కాలుష్యం ప్రమాదం కూడా కొరలు చాస్తోంది. ప్రస్తుతం మానవాళితో పాటు సమస్త ప్రాణికోటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. కాలుష్యం.. ప్రధానంగా కాలుష్యాన్ని మూడు రకాలుగా విభజిస్తారు.. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం..

విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయమైన ఈ పుడమితల్లిపై వినాశకర ప్రభావాలు కాలుష్యంతోనే.. సహజ వనరులకు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లడంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.. ప్రస్తుత కాలంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులను మనం చూస్తూనే ఉన్నాం.. వాస్తవానికి ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి, జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యంగా పేర్కొంటారు.. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాలు.. వ్యర్థాలు.. ఇలా ఉపయోగానికి పనికిరాకుండా హానికలిగించే చాలా వస్తువుల వల్ల పరిసరాలు పలువిధాలుగా కలుషితమవుతున్నాయి. అంటే.. కలుషితం అనేది.. ఘన, ద్రవ, శబ్ధ రూపంలో ఎలాగైనా జరగొచ్చు.

కొన్నెళ్లుగా అధ్యయనం..

జనాభా పెరుగుదల, శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ కాలుష్యం కూడా అధికమై.. జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఇటీవల అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యం లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది.. ముఖ్యంగా వాయు కాలుష్యం రోజుకు వేలాది మంది ప్రాణాలను బలిగొంటోందని తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది.. అదెక్కడో అనుకునేరు.. మన దేశంలోనే.. మన దగ్గరే.. వాయుకాలుష్యంతో వందలాది మంది మరణిస్తున్నారని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా భారతదేశంలోని మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్య సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఇది వేలాది ప్రాణాలను బలిగొంటుందని వెల్లడించింది. వివిధ పరిశోధనా పద్ధతులను ఉపయోగించి కొన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఈ అధ్యయనం ప్రస్తుత పరిస్థితులను వివరించింది.

లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ఇటీవల ‘‘భారతదేశంలోని పది నగరాల్లో పరిసర వాయు కాలుష్యం, రోజువారీ మరణాలు’’ అనే అంశంపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌లోని పది నగరాలు.. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం నిర్వహించింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33 వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని లాన్సెట్ నివేదిక తెలిపింది. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం వాయు కాలుష్యం వల్లే అంటూ పరిశోధనలో తెలిపింది.

Air Pollution

లాన్సెట్ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని లాన్సెట్ నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,597 మరణాలకు వాయు కాలుష్యమే కారణమని బాంబ్ పేల్చింది. వాయు కాలుష్యం కారణంగా హైదరాబాద్‌లో ప్రతిరోజూ కనీసం నలుగురు చనిపోతున్నారని అధ్యయనం పేర్కొంది. హైదరాబాద్‌లో 2008 – 2019 మధ్య 5.6 శాతం మరణాలకు వాయు కాలుష్యం కారణం. ఈ అధ్యయనంలో.. ముంబై, కోల్‌కతా తర్వాత న్యూ ఢిల్లీలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది వాయు కాలుష్యం కారణంగా మరణించారని తెలిపింది.. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతం. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లేనని పరిశోధన తెలిపింది.

Air Pollution

ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా 80 లక్షల మందికి పైగా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. వీరిలో ఐదేళ్ల లోపు చిన్నారులు 7 లక్షల మందికి పైగా ఉన్నారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలు వాయు కాలుష్యం కారణంగా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో సంభవిస్తున్నాయి. పెద్దవారిలో ఎక్కువ మరణాలు అధిక రక్తపోటు కారణంగా సంభవిస్తున్నాయి.  టొబాకో, సరైన డైట్ లేకపోవడం వంటి కారణాలతో నమోదవుతున్న మరణాల కంటే వాయు కాలుష్యం కారణంగానే ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నట్లు తాజా అధ్యయయనాలు తేల్చాయి.

భారత్‌లో వాయు కాలుష్య మరణాలు.. సంవత్సరానికి..

  • అహ్మదాబాద్ – 2,495
  • బెంగళూరు – 2,102
  • చెన్నై – 2,870
  • ఢిల్లీ – 11,964
  • హైదరాబాద్ – 1,597
  • కోల్‌కతా – 4,678
  • ముంబయి – 5,091
  • పూణె – 1,367
  • సిమ్లా – 59
  • వారణాసి – 831

చిన్నారుల పాలిట శాపంగా వాయు కాలుష్యం..

వాయు కాలుష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో ప్రతి రోజూ 464 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు వాయు కాలుష్య కాటుకు బలవుతున్నారు. 2021లో దేశంలో 21 లక్షల మంది వాతావరణ కాలుష్యం కారణంగా మృతి చెందినట్లు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024 నివేదిక వెల్లడించింది. 23 లక్షల మరణాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 81 లక్షల మంది వాయు కాలుష్య కాటుకు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి నాలుగు వాయు కాలుష్య మరణాల్లో ఒకటి భారత్‌లోనే సంభవిస్తున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. టొబాకో, డయాబెటీస్ కంటే ఎక్కువగా మరణాలకు వాయు కాలుష్యం కారణం అవుతోంది.

Air Pollution

ప్రామాణిక పరిమితులను మించిన కాలుష్య రేణువులు..

ఈ అధ్యయనాన్ని భారత్‌ సహా విదేశీ పరిశోధకులు కలిసి నిర్వహించారు. నగరాల్లో తీవ్ర కాలుష్యం అంటే.. పర్టిక్యులేట్ మ్యాటర్ (PM) 2.5.గా ఉందని.. ఈ మరణాలకు కారణం ఇదే కావొచ్చని తెలిపింది. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని వెల్లడించింది. సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని పేర్కొంది.. 2008 నుంచి 2019 మధ్య పది నగరాల్లోని సివిల్‌ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు. నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు.

(పర్టిక్యులేట్ మ్యాటర్ (PM) ను ఏరోసోల్స్ అని కూడా పిలుస్తారు.. ఇది గాలిలో ఉండే సన్నని ధూళి, చిన్న ద్రవ బిందువుల మిశ్రమం. చాలా సూక్ష్మమైన పదార్థం కంటితో కనిపించనంత చిన్నదిగా ఉంటుంది..)

పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్‌ మీటరుకు 10 మైక్రోగ్రాములు.. పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం పేర్కొంది.. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని.. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని తెలిపింది. ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే.. బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్లు వెల్లడించింది. పీఎం 2.5 స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిల్లోనే మరణాలు అధికమవుతున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ‘సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌’కు చెందిన సిద్ధార్థ్‌ మండల్‌ వివరించారు. ఇలా వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్‌లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ్‌ కృష్ణ పేర్కొన్నారు. దీనివల్ల భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడైనట్లు చెప్పారు.

Air Pollution

ప్రాణాలకు ముప్పుగా గాలి నాణ్యత.. శరీరంలోకి ప్రవేశించి..

PM 2.5 అనేది 2.5 మైక్రాన్లు లేదా చాలా చిన్న పరిమాణంలో అంటే కంటికి కనిపించని.. నలుసు లాంటి కాలుష్య కారకాల వర్గాన్ని సూచిస్తుంది. అవి చాలా చిన్నవిగా ఉన్నప్పుడు.. ముక్కు వెంట్రుకలు, శ్లేష్మం, ఇతరుల వంటి మన శరీర రక్షణ కవచాలను సులభంగా దాటవేస్తాయి.. మన శరీరంలోకి లోతుగా ప్రవేశిస్తాయి. అటువంటి గాలికి ఎక్కువసేపు బహిర్గతం అయినప్పుడు.. అది దగ్గు, శ్వాసలోపం, ఆస్తమా, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తుంది. అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్శిటీ, బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో 2008-2019 మధ్య హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా 5,552 మంది మరణించినట్లు గుర్తించారు.

వాయు కాలుష్యం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..

వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 7 మిలియన్ల మంది అకాల మరణాలకు కారణమవుతుంది.. వాస్తవానికి వాయు కాలుష్యం అనేది వ్యాధి.. అని.. అకాల మరణాలకు, అతిపెద్ద పర్యావరణ ప్రమాద కారకంగా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పేర్కొంటారు..

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, చర్మ సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనేక కాలుష్య సంబంధిత వ్యాధులకు వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. ఇది బలహీనమైన జ్ఞానం, డిప్రెషన్, హానికరమైన పెరినాటల్ ఆరోగ్యం వంటి మానసిక రుగ్మతలను కలిగిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాయు కాలుష్యంతో స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమి సమతుల్య జీవావరణ క్రమమునకు కూడా హాని కలిగిస్తుంది. జీవుల మనుగడకు చేటు చేస్తున్న వ్యర్థాలు, రసాయనాలు, వాయువులు, వాటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు, నివారణ చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సంబంధిత ప్రభుత్వ చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

జనాభా విస్ఫోటనం వలె ఇంధన వనరుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. వాహనాలు, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, పాత ఆటోమోటివ్ వ్యవస్థలను ఉపయోగించడం కూడా కారణమే.. కావున ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాన్ని పెంచడం, కార్బన్ ఉద్ఘారాల హానికరమైన ప్రభావాన్ని తగ్గించడానికి, స్థిరమైన ఇంధన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడానికి పర్యావరణ అనుకూలత వ్యవస్థను అనుసరించడం చాలా ముఖ్యం.