ఆపరేషన్ సింధూర్ సమయంలో అసలేం జరిగింది? దుమారం రేపుతున్న CDS కామెంట్స్!
ఆపరేషన్ సింధూర్ సమయంలో అసలేం జరిగింది? శత్రువుని ఎంత నష్టపరిచామో చెబుతున్నారు కాని.. మనం ఎంత నష్టపోయామో.. ఏమేమి కోల్పోయామో చెప్పాలంటోంది కాంగ్రెస్ పార్టీ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో ఎంత నష్టం జరిగిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఆపరేషన్ సింధూర్ సమయంలో అసలేం జరిగింది? శత్రువుని ఎంత నష్టపరిచామో చెబుతున్నారు కాని.. మనం ఎంత నష్టపోయామో.. ఏమేమి కోల్పోయామో చెప్పాలంటోంది కాంగ్రెస్ పార్టీ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి.
ఆపరేషన్ సింధూర్‌పై భారత ప్రభుత్వాన్ని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆపరేషన్‌లో ఎంత నష్టం జరిగిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది. మనం ఎన్ని రాఫెల్ జెట్స్ కోల్పోయామో చెప్పాలంటున్నారు నేతలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మొదలైన ఈ డిమాండ్ల పర్వం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సాగింది. ఈ నేపథ్యంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షానికి ఆయుధమైంది.
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా తాము తొలుత కొన్ని పొరపాట్లు చేశామని.. దీనివల్ల కొన్ని జెట్స్ కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు CDS జనరల్ అనిల్ చౌహాన్. అయితే జెట్స్ కోల్పోవడం కన్నా.. వాటిని ఎందుకు కోల్పోయామన్నదే ముఖ్యమైన ప్రశ్న అన్నారు. ముందు చేసిన తప్పిదాలు తక్షణమే సరిదిద్దుకుని ఆతర్వాత పాకిస్థాన్‌పై టార్గెటెడ్ స్ట్రైక్స్ చేశామన్నారు. అయితే ఆరు రాఫెల్ ఫైటర్ జెట్లు కూలాయన్నది తప్పన్నారు అనిల్ చౌహాన్.
అయితే CDS వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్‌పై ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఈ ఆపరేషన్‌పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలని.. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాస్తవాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సైన్యం పరాక్రమాన్ని.. తన గొప్పతనంగా ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారంటూ ఖర్గే మండిపడ్డారు. ఇక తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్‌లో ఏం జరిగిందో కేంద్రం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే తమను విమర్శించారని.. సీడీఎస్ వివరాలు చెప్పిన తర్వాత అయిన కేంద్రం జరిగిందేంటో బయటపెట్టాలన్నారు.
ఇటీవల ఎయిర్ మార్షల్ AK భారతి కూడా ఈ విషయంపై మాట్లాడారు. యుద్ధంలో కొంతవరకు నష్టపోతామని.. అయితే అవన్నీ బేరీజు వేసుకోమన్నారు. తమ టార్గెట్లు చేరుకున్నామా లేదా అనేదే చూస్తామన్నారు ఏకే భారతి. నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో పైచేయి సాధించామన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం కేంద్రం పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




