అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారా? నాడు ఆమెను గెంటేసిన పార్టీ నేతలే తిరిగి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారా? అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నాడీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శశికళ తిరిగి పార్టీలోకి చేరాలనుకుంటే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పన్నీర్ మాటలు వింటుంటే త్వరలో అన్నాడీఎంకే అధిష్టానమే శశికళను పార్టీలోకి ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు.
పార్టీలోకి ఎవరైనా రావచ్చు…
కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న శశికళ ఈ మధ్యే తన పేరుతో శిలా ఫలకాన్ని తయారు చేయించి.. పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామంచంద్రన్ మెమోరియల్ దగ్గర ఆవిష్కరించారు. ఆ ఫలకంపై అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అని కూడా రాయించుకున్నారు. దీనిపై పార్టీ నేతలు గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపూరితంగా ప్రకటనలు చేయడం, అసమ్మతి, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, భయాందోళనలు కలిగించే ఉద్దేశంతోనే ఆమె శిలాఫలకాన్ని ఆవిష్కరించారంటూ, తనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కూడా శశికళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నందున చర్యలు తీసుకునేందుకు వీలుపడదని ఆమె తరఫున న్యాయవాది చెబుతున్నారు. ఇదిలా సాగుతుండగానే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న పన్నీర్ సెల్వం ‘రాజకీయాల్లో ఎవరైనా… ఎప్పుడైనా… ఏ పార్టీలోనైనా చేరవచ్చు.. వెళ్లిపోవచ్చు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్నాడీఎంకే నేతల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక ఇటీవల పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మరణించిన సమయంలోనూ శశికళ స్వయంగా పన్నీర్ ఇంటికెళ్లి సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే.
Also Read:Sonia Gandhi: అన్యాయంపై పోరాడండి.. బాధితులకు అండగా ఉండండి.. పార్టీ శ్రేణులకు సోనియా పిలుపు..