
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిటీ రిపోర్టు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో జయలలిత మృతి.. ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో శశికళ సహా పలువురు వ్యవహరించిన తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే నేత, ఓపీఎస్ మద్దతుదారుడు కోవై సెల్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు ఎక్కువగా స్వీట్స్, ఐస్ క్రీంలు ఇచ్చి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని పేర్కొన్నారు. ఆమెకు షుగర్ ఉన్నప్పటికీ టీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆమెకు స్వీట్స్ తినిపించారని ఆరోపించారు. ఆమెకు ఆరోగ్యం విషమించినపుడు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిద్దామని అప్పటి సీఎం పన్నీర్ సెల్వం చెప్పినప్పటికీ శశికళ ఒప్పుకోలేదని సెల్వరాజ్ పేర్కొన్నారు. జయలలిత మరణంపై రెండు కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పటికీ పళనిస్వామి ఇంతవరకూ ఎందుకు నోరు విప్పడం లేదని.. ప్రశ్నించారు. పళనిస్వామి, శశికళ ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని కోవై సెల్వరాజ్ డిమాండ్ చేశారు.
చెన్నై చేప్పాక్కం ప్రెస్‌క్లబ్‌లో శనివారం కోవై సెల్వరాజ్.. జయలలిత మరణంపై నియమించిన అరుణా జగదీశన్ కమిషన్, ఆరుముగస్వామి కమిషన్ నివేదికల గురించి ఆయన మాట్లాడారు. రెండు నివేదికలు బయటకు వచ్చినప్పటికీ.. ఎడప్పాడి మాట్లాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎడప్పాడి, శశికళ సహా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
న్యాయం చేయకపోతే జయలలిత సమాధి వద్ద కార్యకర్తలతో కలిసి నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని కోవై సెల్వరాజ్ తెలిపారు. జయలలిత మరణ రహస్యంపై అసెంబ్లీలో నివేదికను వెల్లడించిన చెప్పిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..