MP Election 2023: ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా అయోధ్య రామమందిరం.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అయోధ్య రామమందిర నిర్మాణం హాట్‌టాపిక్‌గా మారింది. రామమందిర నిర్మాణాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే రాముడికి , మందిరానికి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకమని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ,కాంగ్రెస్ మధ్య నువ్వా ? నేనా అన్న రీతిలో పోటీ ఉంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణంపై రెండు పార్టీల మధ్య మాటలయుద్దం జరుగుతోంది. రామమందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ హోర్డింగ్‌ల్లో ఆలయం బొమ్మలను ప్రచారానికి వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
అయితే అయోధ్య రామమందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇన్నాళ్లకు రామాలయ నిర్మాణం జరుగుతుంటే.. కాంగ్రెస్‌కు బాధ కలుగుతోందంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ భాజపా మతపరమైన చిహ్నాలను వాడుతోందని కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజుల క్రితం ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కటౌట్లు, హోర్డింగులపై అయోధ్య రామమందిరం, ఉజ్జయిని మహాకాల్ లోక్ ఆలయాల చిత్రాలను ముద్రించిందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.
ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదుపై బీజేపీ గట్టి కౌంటరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాముడికి వ్యతిరేకమంటూ ప్రచారం మొదలుపెట్టింది. అవసరమైతే మీరూ రాముడి చిత్రాలు పెట్టుకోండని కాంగ్రెస్‌కు సూచిస్తోంది. అయితే మర్యాదా పురుషోత్తముణ్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రణదీప్ సూర్జేవాలా అంటున్నారు.
రామమందిరంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మీకు రాముడి పేరు వింటే ఇబ్బందిగా ఉందా ? లేక మందిరం అంటే భయంగా ఉందా కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాముడి పేరుపై మీకు అభ్యంతరం ఉంటే మహాత్ముడి సమాధిపై కూడా రాముడి పేరు ఉంటుందని ఎదురు దాడికి దిగుతోంది బీజేపీ. ఇక మందిరంపై అభ్యంతరం ఉంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఆలయాలను సందర్శిస్తున్నారని.. రాముడిపై , మందిరంపై అభ్యంతరం లేకుంటే ఎందుకు ఫిర్యాదు చేశారు ప్రశ్నించింది బీజేపీ. కాంగ్రెస్ కూడా రామ మందిరం హోర్డింగ్‌లు పెట్టుకోవచ్చని..వారి ఎవరు ఆపారని బీజేపీ సెటైర్లు వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది బీజేపీ. అయితే తాము హిందుత్వకు వ్యతిరేకంగా కాదని, బీజేపీ మత రాజకీయాలకు మాత్రమే వ్యతిరేకమని కాంగ్రెస్ నేతలంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి