భారత్‌కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. పర్యటన వెనుక అసలు కారణం అదేనా..?
పుతిన్ భారత్ టూర్‌ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. రెండ్రోజుల పర్యటన కోసం భారతదేశానికి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. రష్యా-భారత్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది పుతిన్ పర్యటన.

పుతిన్ భారత్ టూర్‌ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. రెండ్రోజుల పర్యటన కోసం భారతదేశానికి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. రష్యా-భారత్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది పుతిన్ పర్యటన.
రష్యా చమురు కొంటున్నందుకు అమెరికా ఉక్రోషంతో ఊగిపోతున్న సమయంలో భారత్‌లో పర్యటించబోతున్నారు పుతిన్. రష్యా అధ్యక్షుడి పర్యటనలో రెండుదేశాల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. పుతిన్ పర్యటనకు ముందే భారత్‌తో సంబంధాలపై సానుకూల ప్రకటన చేశారు రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి. వాణిజ్య లోటు విషయంలో భారత ఆందోళనలు తమకు తెలుసంటూనే.. దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న పెస్కోవ్.. ఆ దిశగా చర్చలుంటాయని సంకేతాలిచ్చారు.
అమెరికా ఆంక్షలు విధించినా.. భారత్‌కు చమురు సరఫరా తగ్గకుండా చూసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పుతిన్ అధికార ప్రతినిధి. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. రెండు దేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించబోతున్నారు. రష్యాతో మొదట్నించీ భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ అనుబంధం కొనసాగుతోంది. ఏదైనా సమస్య వచ్చిన ప్రతీసారీ భారత్‌కి రష్యా అండగా నిలుస్తోంది.
భారత్ స్నేహ హస్తం చాస్తున్నా అమెరికా అధ్యక్షుడు బెట్టు చేస్తున్నారు. మిగిలిన దేశాలతో పాటు భారత్‌పైన కూడా సుంకాల మోత మోగించారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌ను దువ్వుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపైనా ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. కానీ రష్యా మొదట్నించీ భారత్‌తో స్నేహపూర్వకంగా ఉంటోంది. భారత్ విషయంలో అమెరికా వ్యవహారశైలిని కూడా ఆ దేశం తప్పుపట్టింది. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక సమ్మిట్‌తో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడబోతోంది.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. దీంతో చాలా దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించేశాయి. ఇలాంటి సమయంలో భారత్ చమురు కొనుగోళ్లతో రష్యాకి మేలు జరుగుతోంది. వాణిజ్య పరంగా కూడా భారత్‌తో రష్యాకు ఎలాంటి వివాదాలు లేవు. ప్రపంచ పరిణామాలతో భవిష్యత్తు వ్యూహాలపై, పరస్పర అవగాహనపైనా రెండు దేశాలు మనసువిప్పి మాట్లాడుకునేందుకు, కీలక ఒప్పందాలకు వచ్చేందుకు ఈ భేటీ వేదికకాబోతోంది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, ఇంధన రంగ సహకారం, వాణిజ్యం, టెక్నాలజీ బదలాయింపు వంటి అంశాలపై చర్చ జరుగుతుంది.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భారత్‌కు రష్యా నుంచి రక్షణ సహకారం అనివార్యం. రష్యా డిఫెన్స్ టెక్నాలజీని పొందడం భారత్‌కు వ్యూహాత్మక అవసరం. రష్యా నుంచి ఆయుధాలు కొనడమే కాకుండా.. వాటిని స్వదేశంలోనే తయారుచేసుకోవడం, అలాంటి టెక్నాలజీని రష్యా నుంచి పొందడం భారత్‌కి కీలకం కాబోతోంది. రష్యా నుంచి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లు, సుఖోయ్-57 ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తిగా ఉంది. వీటన్నిటిపైనా పుతిన్-మోదీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలతో ఇంధన రంగంలో సహకారంపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరగొచ్చు.
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఢిల్లీకి రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. పోయినేడాది అక్టోబరులో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా ఆతిథ్యమిచ్చింది. ఆ సమయంలో పుతిన్, మోదీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ 2024 జూలైలో తొలిసారి రష్యా వెళ్లారు. ఆ సమయంలో కూడా ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. మోదీ మూడవ పదవీకాలంలో తొలి ద్వైపాక్షిక పర్యటన కూడా ఇదే. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి, రష్యా, భారత్ రెండూ శక్తివంతమైన మిత్రదేశాలన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేందుకు పుతిన్ టూర్ ఉపయోగపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




