AgustaWestland VVIP chopper scam: దేశంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ల కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో అప్‌డేట్ ఇచ్చింది సీబీఐ. దీనిపై మరో సప్లమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారత వాయుసేనకు చెందిన నలుగురు మాజీ అధికారుల పేర్లను ఈ ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది సీబీఐ. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత, ఈ ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది సీబీఐ. వీవీఐపీ ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ కోసం 2010లో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం చేసుకుంది, అప్పటి యూపీఏ ప్రభుత్వం. ఈ ఒప్పందంలో కొందరికి భారీగా ముడుపులు దక్కాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశంలో ఇది రాజకీయ దుమారం రేపింది. 1990ల్లో వీవీఐపీల ప్రయాణానికి ఏఐఎఫ్ సోవియెట్ కాలం నాటి ఎంఐ 8లను వినియోగించేవారు. వీటికి బదులుగా కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని 1999లో ప్రతిపాదనలు చేశారు రక్షణ శాఖ అధికారులు. సాధారణంగా వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ల ఆపరేషనల్ సీలింగ్‌ను 6వేల మీటర్లకు ఎయిర్‌ఫోర్స్ సెట్ చేసింది.
అయితే ఎస్‌పీ త్యాగీ వాయుసేనాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ సీలింగ్‌ను 4500 మీటర్లకు కుదించారు. దీంతో ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థ పోటీలోకి వచ్చేందుకు అవకాశం లభించినట్లయింది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థే మధ్యవర్తులను ఉపయోగించి ఈ నిబంధనలను సడలించేలా చేసిందని, ఇందుకోసం త్యాగీ, ఆయన బంధువులకు భారీగా ముడుపులు అందాయని సీబీఐ దర్యాప్తులో తేలింది. త్యాగీ సహా, మరో 11 మందిపై 2017లో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఆ తర్వాత 2020 సెప్టెంబరులో మీడియేటర్ క్రిస్టియన్ మైఖెల్, మరికొందరిపై రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
Also Read: