Agnipath Protest News: కేంద్రప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ (Rajyavardhan Singh Rathore) స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన.. ‘4 ఏళ్ల తరువాత అగ్నివీర్ ఏం చేస్తాడో అంటున్న వారు జాగ్రత్తగా స్కీమ్ ను అర్థం చేసుకోవాలి. దయచేసి ఎవరూ మోసపోకండి. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను అర్థం చేసుకోండి. ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం. ఈ రిక్రూట్‌మెంట్ పథకం ద్వారా ఎక్కువ మంది సైన్యంలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్ఎఫ్, పోలీస్ ఇలా ఇతర సేవల్లోనూ చేరే అవకాశం ఉంది. భారతీయ ఆర్మీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నమ్మకం ఉంచండి’ అని వీడియోలో చెప్పుకొచ్చారు రాజ్యవర్థన్.
కాగా సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రైళ్లకు, రైలు పట్టాలు, ఫర్నీచర్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గత రెండ్రోజులుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాలు నేడు సికింద్రాబాద్‌కు పాకాయి. స్టేషన్లలోని పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈక్రమంలో ఆందోళన కారులను అదుపుచేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..