ముకేశ్ అంబానీ ఇంటివద్ద ఇటీవల పార్క్ చేసిన వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ను కనుగొనడం, ఈ కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ని ఎన్ ఐఏ అరెస్టు చేయడం, ఆయన కస్టడీని ముంబై కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించడం వంటి పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానే మరో సీనియర్ అధికారి హేమంత్ నాగ్రాలేని కొత్త పీసీగా నియమించింది. పరమ్ బీర్ సింగ్ నిహోమ్ గార్డ్స్ శాఖకు ట్రాన్స్ ఫర్ చేశారు. 1987 మహారాష్ట్ర కేడర్ ఆఫీసర్ అయిన హేమంత్..2014 లో కొద్దికాలంపాటు నగర పోలీసు కమిషనర్ గా వ్యవహరించారు. ఇటీవలే ఆయనకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మహారాష్ట్ర పోలీసు అదనపు ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. తన 32 ఏళ్ళ సర్వీసులో ఈయన రాష్ట్రపతి పోలీసు పతకం, విశేష్ సేవా పతకం వంటి పలు అవార్డులను పొందారు. 1992 లో బాబరీ మసీదు కూల్చివేత అనంతరం షోలాపూర్ లో మత ఘర్షణలు రేగకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచడంలో హేమంత్ కీలక పాత్ర వహించారు. 1998 నుంచి 2002 వరకు సీబీఐ లో పనిచేశారు.
సచిన్ వాజే ఉదంతంతో మహారాష్ట్ర పోలీసు శాఖ కొంత అప్రదిష్ట మూట గట్టుకుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఈ మార్పులకు పూనుకొన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్కే సు దర్యాప్తు బాధ్యతను నగర పోలీసు విభాగం నుంచి తప్పించి, సీబీఐకి అప్పగించడం, అలాగే సచిన్ వాజే వ్యవహారంలో కూడా రాష్ట్ర యాంటీ టెర్రరిజం విభాగం ఇన్వెస్టిగేషన్ ని పక్కన బెట్టి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ ) కే అప్పగించడం వంటి కేంద్ర చర్యలతో మహారాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నిజానికి ఒకప్పుడు సచిన్ వాజే ని ఎన్ కౌంటర్ల స్పెషలిస్టుగా అభివర్ణించారు. కానీ ముకేశ్ అంబానీ ఇంటి వద్ద ఉంచిన వాహన యజమాని మాన్ సుఖ్ హిరేన్ మృతి, ఆయన వాహనం చోరీ తదితర ఘటనలతో ఆయన బండారం బయటపడిపోయి, చివరకు ఆయనను ఎన్ఐఏ అరెస్టు చేయడం వరకు వెళ్ళింది.
మరిన్ని ఇక్కడ చదవండి: హిందూ మహాసముద్రంలో కొన్ని వేల అడుగుల లోతున ఏమిటా విచిత్ర జీవి ? షేపులు మార్చుకుంటున్న ‘ఏలియన్’ ?