ఆ ఇంట్లో పెళ్లి కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. బంధువులు, హితులతో పెళ్లి మండపం కళకళలాడుతుంది. పెళ్లి తంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాకముందే ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ వివాహం ఆగకూడదని పెళ్లి పెద్దలు వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఇటావా జిల్లా సనద్‌పూర్‌లో సురభి అనే యువతికి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు మండపానికి చేరుకున్నారు. పెళ్లి తంతు ప్రారంభమైంది. కానీ, పూలదండలు మార్చుకున్న తర్వాత వధువు సురభి పెళ్లిపీటలమీదే అకస్మాత్తుగా కూలిపోయింది. అలసటతో కళ్లుతిరిగి పడిపోయిందని భావించిన కుటుంబసభ్యులు డాక్టర్‌ను అక్కడికి పిలిపించారు. వైద్యుడు ఆమెను పరీక్షించి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పాడు. ఈ పరిణామంతో వివాహవేడుకలో విషాదం అలుముకుంది. అయితే, పెళ్లికి వచ్చిన బంధువులు, చేసిన ఖర్చు దృష్ట్యా పెళ్లి ఆగిపోకూడదని భావించిన ఇరు కుటుంబాలు.. వధువు సోదరిని మనోజ్‌కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాయి. దీంతో వధువు మృతదేహాన్ని ఒక గదిలో ఉంచి.. ఆమె సోదరితో పెళ్లి జరిపించారు.పెళ్లి మధ్యలో సోదరి మృతి చెందడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, పెద్దల సూచనల మేరకు మరో సోదరిని వరుడికి ఇచ్చి వివాహం జరిపించామని సురభి సోదరుడు వాపోయాడు.
Also Read: తిప్పతీగతో అతడి లక్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు