కనిపించే దేవుళ్లనీ వదలని కరోనా రక్కసి…ప్రాణం పోయబోయి ప్రాణాలు వదులుతున్న వైద్యులు..
కోవిడ్ మహమ్మారి వైద్యులనూ వదలడంలేదు. రోగుల ప్రాణాలు కాపాడుతూ వైద్యులు ప్రాణాలు వదులుతున్నారు. అలా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 747 వైద్యులు బలయ్యారు.
కనిపించే దేవుళ్లు..వైద్యులు. కోవిడ్ మహమ్మారి అలాంటి దేవుళ్లనీ వదలడంలేదు. కరోనా బారినపడిన రోగులకు ప్రాణభిక్షను ప్రసాదించే ప్రయత్నంలో వైద్యులు కూడా ప్రాణాలు వదులుతున్నారు. అలా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 747 వైద్యులు బలయ్యారు. ఆ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సెక్రటరీ జనరల్ డాక్టర్ జయేష్ లేలే వివరాలు వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) రిజిస్ట్రి ప్రకారం…గత సంవత్సరకాలంగా దేశంలో కరోనాతో మరణించిన వైద్యలు 747 మంది. రాష్ట్రాల వారీగా కూడా ఐఎంఎ విశ్లేషణ చేసింది. ఇందులో అత్యధిక మరణాలు తమిళనాడు (89)..తరువాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ (80)…ఆంధ్రప్రదేశ్ (70) నాలుగో స్థానంలో ఉండటం విశేషం.
2021, ఫిబ్రవరి 5న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అశ్వని చౌబే లోక్‌సభకు ఇచ్చి సమాధానం ప్రకారం..నాటి వరకూ దేశవ్యాప్తంగా మరణించిన డాక్టర్లు 174 మంది మాత్రమే. మరో 116 మంది నర్సులు, 199 మంది ఇతర ఆరోగ్య సిబ్బంది కూడా మరణించినట్లు వెల్లడించారు. అయితేకేంద్ర మంత్రి ప్రకటనను అప్పుడే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండించింది. 2021, ఫిబ్రవరి 2 నాటికే దేశంలో 734 మంది డాక్టర్లు మరణించినట్లు ఐఎంఎ వెల్లడించింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో మభ్యపెడుతోందని మండిపడింది.
కాగా మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తమ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరాలు వెల్లడించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 5,913 మంది డాక్టర్లకు కరోనా సోకింది. 4,217 మంది నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరే కాకుండా ఆరోగ్య కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 17,975 మంది ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్-19 బారిన పడ్డారు. వారిలో 11,235 మంది ప్రభుత్వాసుపత్రుల నుండి, 6,740 మంది ప్రైవేటు రంగానికి చెందినవారు ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 178 ఆరోగ్య కార్యకర్తలు మరణించినట్లు వెల్లడించారు.
తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం…2021, ఏప్రిల్ 15 వరకూ దేశంలో కరోనాతో డాక్టర్లు అత్యధికంగా మరణించిన టాప్-10 రాష్ట్రాలు…
1. తమిళనాడు – 89 2. పశ్చిమ బెంగాల్ – 80 3. మహారాష్ట్ర – 74 4. ఆంధ్రప్రదేశ్ – 70 5. కర్ణాటక – 68 6. ఉత్తరప్రదేశ్ – 66 7. గుజరాత్ – 62 8. బీహార్ – 40 9. ఢిల్లీ – 22 10.మధ్యప్రదేశ్ – 22